బీజేపీ సంగతి చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంపై యూపీఏలో గందరగోళం లేదని, ప్రతిపక్ష బీజేపీ నుంచే గట్టి హామీ లభించాల్సి ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చెప్పారు. బీజేపీ యూటర్న్ తీసుకుంటే తప్ప బిల్లు ఆమోదం పొందడం కష్టసాధ్యమేమీ కాదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి దగ్గరగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాత్రమే బిల్లు ఆమోదంపై స్పష్టత ఇవ్వగలరని, ఆయన్ను కలసి ఒత్తిడి తేవాలని నేతలకు సలహా ఇచ్చారు. దీంతో తెలంగాణ నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ద్వారా రాజ్‌నాథ్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.
టీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, డీకే అరుణ, సునీతారెడ్డి, గీతారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, విప్‌లు అనిల్, ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యేలు బిక్షమయ్యగౌడ్, ప్రవీణ్‌రెడ్డి, రాంరెడ్డి దామోదరరెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నేతలు మల్లు రవి, దయాసాగర్‌లు దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తీరు, సీఎం వ్యవహారశైలి, రాజ్యసభ ఎన్నికలు, బిల్లు ఆమోదం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు.
‘‘చర్చ సందర్భంగా సీమాంధ్ర నేతల తీరు ఆక్షేపణీయం. సీఎం ఇచ్చిన తిరస్కరణ నోటీసును సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించినా తెలంగాణ బిల్లుకే తిరస్కారమన్ననట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం సైతం బ్రహ్మాస్త్రం అని చెప్పుకుంటున్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నార’’ని జానారెడ్డి, గీతారెడ్డి ఫిర్యాదు చేశారు.
సీఎంపై చర్యలకు కొందరు నేతలు పట్టుబట్టగా... ‘‘ఏడో తేదీన రాజ్యసభ ఎన్నికల వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూస్తారుగా’’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అభ్యర్థులకే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఓటేసేలా ఆదేశాలు ఇవ్వాలని కొందరు నేతలు కోరారు. పరోక్షంగా తామంతా టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కేశవరావుకు మద్దతిస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే దిగ్విజయ్ అభ్యంతరం చెబుతూ... తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సీమాంధ్రలోని అభ్యర్థులకు మద్దతు పలకాలని సూచించారు.
బీజేపీ వెనక్కి వెళ్లదు: టీ మంత్రులు
‘‘బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను ఒకటీ రెండు రోజుల్లో కలుస్తాం. వీలునుబట్టి అన్ని జాతీయ పార్టీ నేతలను కలుస్తామ’’ని సమావేశం అనంతరం మంత్రి గీతారెడ్డి, డీకే అరుణ తెలిపారు. తెలంగాణకు తొలి నుంచీ మద్దతిస్తున్న బీజేపీ వెనక్కి వెళ్తుందని తాము భావించట్లేదన్నారు. లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌లతో విడివిడిగా భేటీ అయి తెలంగాణకు మద్దతు కోరారు. వారంతా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టం చేసినట్లుగా నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.