టీడీపీకి 87, బీజేపీకి 63 | Telugu desam party VS Bharatiya janata party | Sakshi
Sakshi News home page

టీడీపీకి 87, బీజేపీకి 63

Published Sun, Jan 17 2016 4:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీడీపీకి 87, బీజేపీకి 63 - Sakshi

టీడీపీకి 87, బీజేపీకి 63

తేలిన జీహెచ్‌ఎంసీ సీట్ల సర్దుబాటు లెక్కలు
* ‘గెలుపు’ సీట్లపై పంతం నెగ్గించుకున్న బీజేపీ
* టీడీపీ సిట్టింగ్ సీట్లనూ సొంతం చేసుకున్న వైనం
* భగ్గుమన్న టీడీపీ శ్రేణులు..
* ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్, సుజనా కార్యాలయాల వద్ద ఆందోళన
* బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీ మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల తుదిగడువు ముగిసేందుకు మరికొద్ది గంటల సమయమే ఉండగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి సీట్ల లెక్కలు తేలాయి. మూడు రోజులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపిన అనంతరం... టీడీపీ 87, బీజేపీ 63 సీట్లలో పోటీ చేయాలని ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చారు.

శనివారం అర్ధరాత్రి దాకా పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే, రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నా పెద్దన్న పాత్ర పోషించాలని ఉబలాటపడుతున్న టీడీపీ ప్రతిపాదనలకు కమలనాథులు ఒప్పుకొంటూనే ‘మంచి’ సీట్లకు గురిపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు నియోజకవర్గాల్లో మెజారిటీ డివిజన్లతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్న సీట్లను పొందేందుకు బీజేపీ నేతలు చివరి వరకు ప్రయత్నించారు.

2009లో టీడీపీ గెలిచిన 45 సీట్లు మినహాయించి మిగతా సీట్లను పంచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినప్పటికీ... అందులో 10 సీట్ల వరకు బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. ఈ విషయం శనివారం సాయంత్రానికే బయటకు పొక్కడంతో ఆయా డివిజన్‌లకు చెందిన టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. సుజనా చౌదరి కార్యాలయం వద్ద కూడా టీడీపీ అసంతృప్తుల నినాదాలతో గందరగోళం నెలకొంది. టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్,  చింతల రామచంద్రారెడ్డి, బి.వె ంకటరెడ్డి తదితరులు రాత్రి వరకు సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతూనే ఉన్నారు.
 
బలమున్న సీట్లపై బీజేపీ టార్గెట్..
జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్‌లకు గాను 63 చోట్ల పోటీకి ఒప్పుకొన్న బీజేపీ... అందులో తమకు బలమున్న సీట్లను పొందేందుకు తీవ్రంగా పోరాడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేటలో 5 డివిజన్‌లు ఉండగా ఒక్క నల్లకుంట సీటును మాత్రమే టీడీపీకి కేటాయించినట్లు సమాచారం. చింతల రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న హిమాయత్‌నగర్‌తో పాటు నాలుగు సీట్లు బీజేపీ తీసుకుంది.

సోమాజిగూడ డివిజన్‌ను మాత్రమే టీడీపీకి ఇచ్చేందుకు చింతల ఒప్పుకున్నారు. చివరికి జూబ్లీహిల్స్ సీటును సుభాష్‌రెడ్డి అనే నాయకుడికి ఇవ్వాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ద్వారా టీడీపీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు ఫోన్ చేయిస్తే... దానిని బీజేపీకి కేటాయించేసినట్లు సమాధానమిచ్చే పరిస్థితి. ముషీరాబాద్ నియోజకవర్గంలో రెండు సీట్లు మాత్రమే టీడీపీకి కేటాయించారు. ఇక సెటిలర్లు ఉన్న చోట తమకు ఓట్లు వస్తాయని ఆశ పెట్టుకున్న టీడీపీ నేతలు... అక్కడ కూడా ముఖ్యమైన సీట్లను బీజేపీ సొంతం చేసుకుందని చెబుతున్నారు.

మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్‌తో పాటు సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి దెబ్బతగిలింది. సికింద్రాబాద్‌లోని జనరల్ సీట్లన్నీ బీజేపీ తీసుకుని రిజర్వుడ్ సీట్లను టీడీపీకి వదిలేసింది. అమీర్‌పేట, సనత్‌నగర్ సీట్లను బీజేపీకి కేటాయించడంపై ఇద్దరు మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎంఐఎం ప్రభావం ఉన్న చోట టీడీపీకి?
తక్కువ సీట్లలో పోటీకి ఒప్పుకున్న బీజేపీ నేతలు సీట్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోని మెజారిటీ సీట్లను తీసుకున్న బీజేపీ నాయకులు... నగర శివార్లలోని సీట్లలో కూడా 40:60 ప్రాతిపదికన పోటీ చేసేం దుకు ఆసక్తి చూపారు. శివార్లలోని తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో... టీడీపీ నేతలు కూడా వాటిపై పెద్దగా పట్టు పట్టలేదని తెలిసింది. ఇక ఎంఐఎం ప్రభావం అధికంగా ఉన్న మలక్‌పేట, నాంపల్లి, బహుదూర్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్ మొదలైన చోట్ల సగం కన్నా ఎక్కువ సీట్లు టీడీపీకే అప్పగించినట్లు ఓ నాయకుడు తెలిపారు.
 
నేడు బీజేపీ జాబితా
సాక్షి, హైదరాబాద్: టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని శని వారం అర్ధరాత్రి దాకా సాగిన చర్చల అనంతరం బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రకటించారు. టీడీపీ 87 స్థానాల్లో, బీజేపీ 63 స్థానాల్లో బరిలోకి దిగుతున్నట్టు ‘సాక్షి’కి ఆయన వెల్లడించారు. తాము పోటీ చేసే 63 డివిజన్లలో అభ్యర్థుల వివరాలను ఆదివారం ప్రకటిస్తామన్నారు. టీడీపీ 90, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత అంగీకారానికి వచ్చినా, అందుకు బీజేపీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో టీడీపీతో మరోసారి సమావేశమై 87-63కు అంగీకారానికి వచ్చినట్టు తెలిపారు.
 
చింతలతో మాగంటి వాగ్వాదం
కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం రాత్రి వరకు జరిగిన చర్చల సందర్భంగా ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. హిమాయత్‌నగర్ సిట్టింగ్ సీటును తీసుకోవడం, టీడీపీ బలంగా ఉన్న జూబ్లీహిల్స్‌తోపాటు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ తీసుకోవడంపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌కు మేలు చేసేందుకే బీజేపీ నాయకులు సీట్ల కోసం పట్టుపడుతున్నారని ఆరోపిస్తూ... ఆయన సుజనా చౌదరి ఆఫీస్ నుంచి రాత్రి 8 గంటలకు తన కార్యాలయానికి వెళ్లిపోయారు. బీజేపీ విధానం వల్ల అధికార పార్టీకి మేలు జరుగుతుందంటూ... తాను బీజేపీతో కలసి ప్రచారంలో కూడా పాల్గొనని స్పష్టం చేశారు. టీడీపీ అసంతృప్తులు రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసినా తనకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement