కశ్మీర్‌లో ‘ఉగ్ర’ ఘాతుకం | Terror rocks Kashmir Valley, storm Army camp, kill 11 | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ‘ఉగ్ర’ ఘాతుకం

Published Sat, Dec 6 2014 12:33 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

యూరీలోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన మిలిటెంట్లను హతమార్చాక వారి మృతదేహాలను పరిశీలిస్తున్న సైన్యం. - Sakshi

యూరీలోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన మిలిటెంట్లను హతమార్చాక వారి మృతదేహాలను పరిశీలిస్తున్న సైన్యం.

* యూరీ పట్టణంలోని ఆర్మీ క్యాంప్‌పై భీకర దాడి  
* లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనికులు, ముగ్గురు పోలీసుల మృతి
* 8 మంది మిలిటెంట్లను హతమార్చిన భద్రతా బలగాలు

శ్రీనగర్: కశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందన్న ఆనందాన్ని ఆవిరిచేస్తూ.. మిలిటెంట్లు యూరీలోని ఆర్మీ క్యాంప్ సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడ్డారు. ఆ దాడుల్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

డిసెంబర్ 9న రాష్ట్రంలో మూడో విడత ఎన్నికలు జరగనుండటంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం శ్రీనగర్‌లో ఎన్నికల సభలో పాల్గొననున్న నేపథ్యంలో.. ఈ ఘటనలతో భద్రతాబలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. రహదారులపై, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు తీవ్రం చేశారు. దాడులు జరిగిన యూరీ, శ్రీనగర్, త్రాల్, షోపియన్‌లలో 3, 4 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

బారాముల్లా జిల్లా, యూరీలోని మొహ్ర ఆర్మీ క్యాంప్‌పై శుక్రవారం తెల్లవారుజామున 3.10 గంటలకు ఆరుగురు మిలిటెంట్లు అత్యాధునిక ఆయుధాలతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన భద్రతతో ఉన్న మొదటి బ్యారక్‌లోని సిబ్బందిపై ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పులతో క్యాంప్‌లో మంటలు చెలరేగాయి. దాంతో బుల్లెట్ గాయాలైన నలుగురు సైనికులు బ్యారక్ నుంచి బయటకు రాలేక,  మంటలకు ఆహుతయ్యారు.

సమాచారం అందుకున్న దగ్గర్లోని పంజాబ్ రెజిమెంట్‌లోని తక్షణ స్పందన దళం, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లెఫ్టినెంట్ కల్నల్ సంకల్ప్ కుమార్, మరో ముగ్గురు సైనికులు, ముగ్గురు పోలీసులు(ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు) ప్రాణాలు కోల్పోయారు. జవాన్ల ప్రతిదాడుల్లో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఆరు గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద 6 ఏకే రైఫిళ్లు, 2 షాట్‌గన్లు, 32 గ్రెనేడ్లు, 4 రేడియో సెట్లు, పెద్ద ఎత్తున బుల్లెట్లు, మందుగుండు సామగ్రి లభించింది.

మరో ఘటనలో శ్రీనగర్ శివారైన సౌరాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖారీ ఇస్రార్‌ను, మరో మిలిటెంట్‌ను పోలీసులు హతమార్చారు. శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిరువురినీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారిద్దరూ చనిపోయారు. రానున్న రోజుల్లో శ్రీనగర్‌లో ఒక భారీ దాడికి మిలిటెంట్లు వ్యూహం పన్నినట్లుగా  సమాచారం ఉందని కశ్మీర్ ఐజీపీ అబ్దుల్ మిర్ వెల్లడించారు.

కాగా, దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్, షోపియన్‌లలోనూ మిలిటెంట్లు గ్రెనేడ్ దాడులకు పాల్పడ్డారు. త్రాల్ బస్టాండ్ సమీపంలో విధుల్లో ఉన్న  పోలీసులపై జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పౌరులు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. షోపియన్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పీర్ పంజల్ పర్వతాల గుండా దోడా ప్రాంతం నుంచి మిలిటెంట్లు తరచుగా షోపియన్‌లోకి వస్తుంటారు. కాగా, ఉగ్ర దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రధాని నరేంద్రమోదీ శ్రీనగర్ వెళ్తున్నారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కశ్మీర్‌లో సోమవారం మోదీ రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

‘జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పెరిగిన ఓటింగ్ శాతంతో నెలకొన్న ఆశావహ వాతావరణానికి విఘాతం కలిగించే లక్ష్యంతో జరిగిన దాడులివి. ఉగ్రవాదులతో పోరులో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు 125 కోట్ల భారతీయులు శిరసు వంచి శ్రద్ధాంజలి par ఘటిస్తున్నారు’.
- ట్వీటర్‌లో ప్రధాని మోదీ

‘ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొంటుండటంతో నిరాశలకు లోనైన ఉగ్రవాదులు ఈ దాడులకు దిగుతున్నారు. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పాక్ ప్రయత్నించాలి. సరిహద్దుల నుంచి మిలిటెంట్లు భారత్‌లోకి  విధ్వంసం సృష్టిస్తున్నారు. దీనికి పాక్ బాధ్యత వహించదా?’.
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

‘జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం వల్లనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు’.
- రక్షణ మంత్రి మనోహర్ పారికర్

‘రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతియుత, సాధారణ పరిస్థితులకు విఘాతం కలిగించేందుకే ఈ దాడులు చేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాల్లోని లోపాలను కేంద్రం సరిదిద్దుకోవాల్సి ఉంది’.
- జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement