అసెంబ్లీ ఎజెండాలో లేని ‘అంబేడ్కర్’ | That is not on the agenda of the Assembly 'Ambedkar' | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎజెండాలో లేని ‘అంబేడ్కర్’

Published Fri, Dec 18 2015 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

That is not on the agenda of the Assembly 'Ambedkar'

‘కాల్‌మనీ - సెక్స్‌రాకెట్’పై చర్చను అడ్డుకునేందుకే తెరపైకి
సాక్షి, హైదరాబాద్: ‘కాల్‌మనీ - సెక్స్‌రాకెట్’పై  చర్చను అడ్డుకోవాలనే కుట్రతోనే టీడీపీ సర్కారు గురువారం శాసనసభలో అంబేడ్కర్ పేరును తెరపైకి తెచ్చింది. శాసనసభ శీతాకాల సమావేశాల మొదటి రోజు (గురువారం) చేపట్టాల్సిన  ఎజెండాలో అంబేడ్కర్ ప్రస్తావన లేకపోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. దాన్ని శాసనసభ సచివాలయం ముందురోజే ఖరారు చేసి సభ ఆరంభానికి ముందే సభకు సమర్పిస్తుంది.

అలాగే గురువారానికి సంబంధించిన అసెంబ్లీ  ఎజెండాను అసెంబ్లీ సచివాలయం బుధవారమే తయారుచేసి గురువారం సభలో పెట్టింది. అందులో అంబేడ్కర్ పేరే లేకపోవడం గమనార్హం. గురువారం అజెండాలో మొదటి అంశం కింద ప్రశ్నోత్తరాల సమయం అని , రెండో అంశం కింద సభ ముందుంచే పత్రాలు అని అయిదు ఉప సంఖ్యలతో సహా వివరంగా ఉన్నాయి. రెండో అంశంలోని ఉప సంఖ్యల కింద ఆంధ్రప్రదేశ్  మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సవరణ ఆర్డినెన్స్ -2015ను, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ 2010 -11 , 2011- 12 సాంవత్సరిక నివేదికలను సీఎం సభకు సమర్పిస్తారని  ఉంది.

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 2013 - 14 వార్షిక నివేదికను మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ 2013 -14 వార్షిక నివేదికను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు సంబంధించిన 18 -21 వార్షిక నివేదికలను మంత్రి నారాయణ సభ ముందుంచుతారని ఉంది.  ఈ మేరకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణరావు పేరుతో 17వ తేదీ అసెంబ్లీ కార్యకలాపాల ఎజెండా విడుదలైంది.
 
కుట్రతోనే అప్పటికప్పుడు తెరపైకి...
సమాజం సిగ్గుపడేలా విజయవాడలో సాగుతున్న ‘కాల్‌మనీ - సెక్స్ రాకెట్’పై సభలో చర్చకు అనుమతించాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఉదయం వాయిదా తీర్మానం ఇవ్వడంతో టీడీపీ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో విపక్ష సభ్యులు ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వగానే  ప్రభుత్వ నేతలకు తెలిసిపోయింది.

దీనిపై చర్చకు అనుమతిస్తే ‘కాల్‌మనీ - సెక్స్ రాకెట్’లో కూరుకుపోయిన కీలక నేతలు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల గురించి ప్రతిపక్షం ఆధారాలతో సహా బయటపెడుతుంది. దీంతో ఇరకాటంలో పడాల్సి వస్తుం దని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు అప్పటికప్పుడు అంబేడ్కర్ సేవలపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, వాటిపై చర్చిద్దామని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ తప్పులను చర్చకు రాకుండా అడ్డుకునేందుకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను వాడుకునే కుట్ర చేసింది.

‘అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు ఏడాది పొడవునా జరుగుతాయి. ఈ అంశంపై సభలో ఏరోజైనా చర్చించొచ్చు. తొలి రోజు సమావేశంలో ఈ అంశం ప్రస్తావనే లేదు. అయితే ‘కాల్‌మనీ - సెక్స్‌రాకెట్’పై చర్చకు అనుమతిస్తే వైఎస్సార్‌సీపీది పైచేయి అవుతుంది... సర్కారు ఇరకాటంలో పడక తప్పదు. అందుకే ఫ్లోర్ మేనేజిమెంట్‌లో భాగంగా అప్పటికప్పుడు అంబేడ్కర్‌ను తెరపైకి తెచ్చాం..’ అని అధికార పక్షానికి చెందిన నాయకులు ఇష్టాగోష్టిలో అనుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement