కుంభకర్ణుడైనా లేవాల్సిందే..
చూడ్డానికి మామూలు అలారంలా కనిపిస్తోంది.. కానీ ఇది మోగితే.. కుంభకర్ణుడైనా సరే లేచి తీరాల్సిందేనని దీన్ని తయారుచేసిన కంపెనీ ఆంప్లికామ్స్ చెబుతోంది. టీసీఎల్ 300 అనే ఈ అలారం ఏ స్థాయిలో మోగుతుందంటే.. మన పక్కనే ట్రైన్ వెళ్తే.. ఎంత సౌండ్ వస్తుందో అంత వస్తుంది. అంతేకాదు.. దీంతోపాటు వచ్చే వైబ్రేటింగ్ ప్యాడ్ పడుకునే ముందు తలగడ కింద పెట్టుకుంటే.. గియ్యి..గియ్యి..మంటూ బుర్ర తిరిగేలా వైబ్రేట్ అవుతుంది. అదే సమయంలో మన ముఖంపై ఫ్లాష్ లైట్ పడేలా చేస్తుంది. ముఖ్యంగా మొద్దు నిద్ర పోయేవారి కోసం, వినికిడి లోపంతో బాధపడేవారి కోసం దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. బ్రిటన్‌కు చెందిన హియరింగ్ డెరైక్ట్ అనే సంస్థ దీన్ని విక్రయిస్తోంది. ధర రూ.3,500.