యూకేలో తగ్గుతున్న భారత్ విద్యార్థులు
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి వి.కె.సింగ్ సమాధానం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడేళ్లుగా యూకే యూనివర్సిటీల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రమంత్రి వి.కె.సింగ్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం లోక్‌సభలో మూడేళ్లుగా లండన్‌లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న మాట వాస్తవమేనా? బ్రిటన్‌లో చదివే వారి వీసా రూల్స్ కఠినతరం చేసింది నిజమేనా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ బ్రిటన్‌లో విద్యాభ్యాసం తర్వాత అక్కడ పని చేసే అవకాశం లేకుండా వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో అక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారన్నారు.
ఈ విషయంపై బ్రిటన్‌తో సంప్రదింపులు జరిపామని, ఆ ప్రభుత్వంతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఖండించిందని పేర్కొన్నారు. అయితే, భారతీయ విద్యార్థులపై ఎలాంటి నిబంధనలూ విధించలేదని తెలిపినట్లు చెప్పారు.