UK university
-
అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు!
‘నువ్వేమైనా కలెక్టర్‌వా? డాక్టర్‌వా? లేకపోతే ఏమైనా కంపెనీకి ఓనర్‌వా? ఆఫ్టరాల్... సెక్యూరిటీ గార్డ్వి. సెక్యూరిటీ గార్డు కూతురు విదేశాల్లో చదవగలదా?’ అని ఆ గార్డు ముఖం మీదే కరుకుగా మాట్లాడారు చాలామంది. బాధ పెట్టే కామెంట్స్ ఎన్ని చెవిన పడ్డా కూతురిని విదేశాల్లో చదివించాలనే లక్ష్యం విషయంలో ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కట్ చేస్తే... యూకే లో ఒక యూనివర్శిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్ కూతురు ధనుశ్రీ గైక్వాడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ధనుశ్రీని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడం, ఆమె తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని స్వీకరించడానికి వేదికపైకి వెళ్లడం, గ్రాడ్యుయేషన్ క్యాప్, గౌన్ ధరించిన ధనుశ్రీ తండ్రిని ఆనందంగా ఆలింగనం చేసుకోవడంలాంటి దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ఆయుష్మాన్ ఖురాన, ఈశా గుప్తాలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘నువ్వు గార్డువి మాత్రమే. నీ కూతురిని విదేశాల్లో చదివించడం అసాధ్యం’ అని తండ్రితో చెప్పిన ప్రతి ఒక్కరికీ వీడియోను షేర్ చేసింది ధనుశ్రీ గైక్వాడ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
వంద పేజీల లేఖ.. ఇదేం లవ్ రా సామి!
100 Pages Harassment Letter.. Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking: ఆ యువకుడు ఆ అమ్మాయి ఒకే కాలేజ్‌లో చదువుతున్నారు. ఓరోజు లవ్ ప్రపోజ్ చేశాడు. జీవితాన్ని పంచుకుంటానని బతిమాలాడాడు. ఆసక్తి లేదని చెప్పింది. అయినా ప్రయత్నాలు మానలేదు. ‘ఛీ కొట్టింది’. కోపంలో ‘వెరైటీ’గా బెదిరింపులకు దిగాడు. వాయిస్ మెసేజ్‌లతో వేధించాడు. స్నేహితులతో భయపెట్టించాడు. ఏకంగా వంద పేజీల లేఖ రాసి ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. కానీ, యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. ఆ ప్రేమోన్మాదికి సరైన శిక్షే పడింది!. ఓ యువతి(26)ని వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థికి తగిన శిక్షే పడింది. సాహిల్ భవ్నానీ(22) అనే స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో ఓ నర్సింగ్ విద్యార్థిని(విదేశీ యువతి!)ని వేధించిన కేసులో బహిష్కరణ శిక్షకు గురయ్యాడు. నాలుగు నెలల శిక్షతో పాటు రెండేళ్ల వేటు, ఐదేళ్ల పాటు బహిష్కరణ శిక్షను ప్రకటించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు కోర్టు. ఒకవేళ తీర్పును ఉల్లంఘిస్తే.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని కోర్టు అతన్ని స్ట్రాంగ్‌గానే హెచ్చరించింది. ఇదిలా ఉంటే సాహిల్‌కు కాలేజ్‌లోనే కిందటి ఏడాది ఆ యువతితో పరిచయం అయ్యింది. లవ్ ప్రపోజ్ చేస్తే.. ఆమె ఒప్పుకోలేదు. ఓరోజు ఆరు నిమిషాల వాయిస్ సందేశం పంపాడు. ఆ వాయిస్ సందేశంలో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, పిల్లలను కని సంతోషకరమైన జీవితం గడుపుదామని కోరాడు. ఆమె ససేమీరా అంది. అక్కడితో ఆగకుండా వంద పేజీల లేఖతో ఓ బెదిరింపు లేఖను కొరియర్ చేశాడు. దీంతో ఆమెలో భయం మొదలైంది. ఆపై తన స్నేహితులతోనూ లొంగిపోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయని ఆమెకు దమ్కీ ఇప్పించాడు. దీంతో సాహిల్ లైంగిక దాడికి పాల్పడతాడనే భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వెంటపడి వేధించిన నేరం ఒప్పుకోవడం, యువతికి నిందితుడు ఎలాంటి హాని చేయలేదన్న వాదనతో శిక్ష మోతాదును తగ్గించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు. ఇక తన నేరాన్ని ఒప్పుకున్న సాహిల్.. మూడు నెలలపాటు గూగుల్‌లో కవితల్ని చదివి.. ఆపై ఆ వంద పేజీల రాక్షస ప్రేమ లేఖను సిద్ధం చేశాడట!. నిజానికి కిందటి నెలలోనే ఈ కేసులో వాదనలు పూరైనప్పటికీ.. తీర్పు ఆలస్యం(జనవరిలో)గా వెలువడుతుంది అంతా అనుకున్నారు. అయితే భవ్నానీ శనివారం తన తండ్రితో కలిసి హాంకాంగ్‌కు వెళ్తున్నాడన్న సమాచారం తెలియడంతో న్యాయమూర్తి నిగెల్ డాలీ ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో తీర్పును ప్రకటించారు. ‘ఇప్పటికైనా ఆ అమ్మాయి వెంటపడవనే అనుకుంటున్నా’ అంటూ జడ్జి భవ్నానీని ఉద్దేశించి సున్నింతగా మందలించారు. మరోవైపు యూకే యూనివర్సిటిల్లో విద్యార్థినులపై వేధింపుల ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది. చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..! -
భారతీయ విద్యార్థులకు లబ్ధి.. రెండేళ్లలో ఈ వీసాపై ఉద్యోగాలు
లండన్: యూకే యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కల్పించే పోస్ట్ స్టడీ వీసా (పీఎస్‌డబ్ల్యూ)కు దరఖాస్తు చేసే గడువును బ్రిటన్ ప్రభుత్వం పెంచింది. దీని మూలంగా భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. యూనివర్సిటీ కోర్సులు పూర్తయిన తర్వాత రెండేళ్లలో ఈ వీసాపై ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అంటే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాన్వేషణ నిమిత్తం రెండేళ్లు యూకేలో ఉండటానికి ఈ వీసా వీలు కల్పిస్తుంది. యూకే హోమ్ సెక్రటరీ ప్రితీ పటేల్ గత ఏడాది ప్రారంభించిన ఈ వీసాలకు దరఖాస్తు చేసే గడువు జూన్ 21తో ముగిసిపోతుంది. అయితే కోవిడ్–19 సంక్షోభం కారణంగా చాలామంది విద్యార్థులు సకాలంలో యూకేకు వెళ్లలేకపోయారు. దీంతో గడువుని సెప్టెంబర్ 27 వరకు పెంచారు. యూకేకి విద్యార్థిగా వచ్చి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 27లోగా రావాల్సి ఉంటుందని యూకే అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. డెల్టా వేరియెంట్ వెలుగులోకి వచ్చాక భారత్ నుంచి ప్రయాణాలపై యూకే నిషేధం విధించి రెడ్ లిస్టులో ఉంచడంతో వీసా గడువు పెంచాలని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ యూకే (ఎన్ఐఎస్ఏయూ) విస్తృతంగా ప్రచారం చేసింది. చదవండి: పీసీసీపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు -
ఎవరీ భారతీయ కుబేరుడు..?
బ్రిటన్‌లోని స్కాట్లాండ్ సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో చేరనున్న ఓ అమ్మాయికి ఆమె తండ్రి సమకూర్చిన సకల సౌకర్యాలను చూసి బ్రిటన్ పత్రికలు ముక్కున వేలేసుకున్నాయి. కూతురి సపర్యల కోసం భారతీయుడైన ఆ తండ్రి విలాసవంతమైన భవంతిని కొనుగోలుచేయడమేకాకుండా ఆమె అడుగులకు మడుగులొత్తేందుకు 12 మంది ఉద్యోగులను నియమించడం అక్కడి పత్రికల్లో పతాకశీర్షికలకెక్కింది. ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ మిడిల్టన్ చదివిన సెయింట్ ఆండ్రూస్ వర్సిటీలోనే ఓ భారతీయ కుబేరుడి కూతురు ఎంట్రీ అట్టహాసంగా మారింది. స్కాట్లాండ్లో అత్యంత సుందరమైన భవంతుల్లో ఒకదాన్ని తండ్రి కొనుగోలుచేసి, ఆమెకు బాగా ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించేందుకు ఒక పాకశాస్త్రప్రవీణుడిని, ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఒక పనిమనిషిని, ఆమె డ్రెస్‌లు, ఆమెకు కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచేందుకు మరో మనిషిని, అమ్మాయి ఇంట్లోకి వచ్చేటపుడు వెళ్లేటపుడు తలుపులు తీసి పట్టుకోవడానికి మరో వ్యక్తినీ, ఇలా ఆమెకు దాదాపు అన్ని పనుల్లో సాయపడేందుకు 12 మంది ఉద్యోగులను నియమిం చారు ఆమె తండ్రి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవాలని సిల్వర్ స్వాన్ రిక్రూట్మెంట్ అనే ఓ ప్రముఖ జాబ్ ఏజెన్సీలో ప్రకటన సైతం ఇచ్చారు. బలహీనంగా ఉండకుండా, హుషారుగా ఉండేవారు మాత్రమే కావాలని పేర్కొన్నారు. భవంతిలో పనిచేయనున్న ఉద్యోగులకు వేతనం సైతం భారీస్థాయిలోనే ఉంది. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.28 లక్షల వేతనం ఇస్తామని ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేది పెద్ద మిస్టరీ అయ్యింది. ఆ కుటుంబం వివరాలు తెలిసిన వారు సమాచారమివ్వాలని బ్రిటన్ పత్రికలు కోరడం మరో విశేషం. -
చాక్లెట్ ప్రియులకు స్వీట్ న్యూస్!
లండన్: చాక్లెట్ ప్రియులకు శుభవార్త. ఇప్పటివరకూ చాక్లెట్ రుచిని ఆస్వాదించిన గ్రాడ్యుయేట్లకు ఓ అరుదైన అవకావం లభించనుంది. యూకే, బ్రిస్టల్‌లోని యూనివర్సిటీస్ ఆఫ్ ఫాకల్టీ ఆఫ్ హెల్త్ అండ్ అప్లైడ్ సైన్సెస్ చాక్లెట్ల తయారీపై పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ ఫిబ్రవరి 27లోగా బ్రిస్టల్‌లోని ఈ వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు ఏడాదికి 12.5 లక్షల రూపాయల స్కాలర్షిప్ అందుతుంది. విదేశాలలో కష్టపడి చదవడమే కాదు ఇష్టపడి ఎంతో నేర్చుకునే కోర్సులు ఉన్నాయని తీపి ఉత్పత్తులతో ప్రపంచంలోనే మేటీ కంపెనీలో ఒకటైన మండెలెజ్ ఇంటర్నేషనల్ అంటోంది. కాడ్బరీ, మిల్కా, ప్రిన్స్, మొదలైన చాక్లెట్ కంపెనీల ఉత్పత్తులను ఎలా చేయలో నేర్చుకోవడంతో పాటు వాటిని టెస్ట్ చేసి సులువుగా థీసిస్ తయారుచేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. బ్రిస్టల్ వర్సీటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకునే వారికి మండెలెజ్ కంపెనీ జాబ్ ఆఫర్‌తో పాటు కోర్సు సమయంలో ట్రెయినీ ఉద్యోగులుగా నియమించనున్నట్లు ప్రకటించింది. -
యూకేలో తగ్గుతున్న భారత్ విద్యార్థులు
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి వి.కె.సింగ్ సమాధానం సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడేళ్లుగా యూకే యూనివర్సిటీల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రమంత్రి వి.కె.సింగ్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం లోక్‌సభలో మూడేళ్లుగా లండన్‌లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న మాట వాస్తవమేనా? బ్రిటన్‌లో చదివే వారి వీసా రూల్స్ కఠినతరం చేసింది నిజమేనా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ బ్రిటన్‌లో విద్యాభ్యాసం తర్వాత అక్కడ పని చేసే అవకాశం లేకుండా వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో అక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారన్నారు. ఈ విషయంపై బ్రిటన్‌తో సంప్రదింపులు జరిపామని, ఆ ప్రభుత్వంతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఖండించిందని పేర్కొన్నారు. అయితే, భారతీయ విద్యార్థులపై ఎలాంటి నిబంధనలూ విధించలేదని తెలిపినట్లు చెప్పారు. -
739 మంది విదేశీ విద్యార్థులకు బ్రిటన్ ‘నో’
లండన్: బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో అణు, జీవ, రసాయనిక ఆయుధాల రూపకల్పనకు దోహదపడే కోర్సులను చేయాలనుకుంటున్న 739 మంది విదేశీ విద్యార్థుల ప్రవేశ దరఖాస్తులను బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల తిరస్కరించింది. ఆ విద్యార్థుల జాతీయతను వెల్లడించడానికి కూడా ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి. ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాదులు చెలరేగిపోతూ సామూహిక మారణహోమాన్ని సృష్టిస్తున్న నేటి పరిస్థితుల్లో తమ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కోర్సులు చేయకుండా విదేశీ విద్యార్థులపై ‘అకాడమీ టెక్నాలజీ అప్రోవల్ స్కీమ్’ కింద నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. టెర్రరిస్టుల చేతుల్లోకి అణు, జీవ, రసాయనిక ఆయుధాల పరిజ్ఞానం వెళ్లకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 2007లోనే ఇలాంటి కోర్సులకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఏయే దేశస్థుల దరఖాస్తులను తిరస్కరించిందో మాత్రం వెల్లడించడానికి ప్రభుత్వ వర్గాలు నిరాకరిస్తున్నాయి. ఈస్ట్ లండన్ సెకండరీ స్కూళ్లో ఇలాంటి కోర్సులు చదివిన ఐదుగురు బ్రిటన్ విద్యార్థినులపై ఇటీవలనే దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదంటూ బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముగ్గురు విద్యార్థినులు గత ఫిబ్రవరి నెలలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా బయల్దేరి వెళ్లారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ ఐదుగురిపై ప్రభుత్వం ట్రావెల్ ఆంక్షలు విధించింది. సద్దాం హుస్సేన్ వద్ద జీవ రసాయనిక యుద్ధ కార్యక్రమంలో పనిచేసిన డాక్టర్ రిహాబ్ తహా అలియాస్ డాక్టర్ జెర్మ్ కూడా బ్రిటన్‌లోని ఈస్ట్ ఆంగ్లియన్ యూనివర్శిటీలో ‘ మొక్కల్లోని విష ఆమ్లాల’ అంశంపై పీహెచ్డీ చేశారు. అణు, జీవ, రసాయనిక కోర్సులు చదివేందుకు బ్రిటన్ విశ్వ విద్యాలయాల్లో అత్యాధునిక లాబరేటరీలు ఉండడం వల్ల ఈ కోర్సులను ఇక్కడే చదివేందుకు విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది కూడా ఈ కోర్సుల్లో చేరేందుకు మొత్తం 3,400 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 739 మంది విద్యార్థుల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. -
యూకే వర్సిటీల్లో సీబీఎస్ఈ +2కి గుర్తింపు
న్యూఢిల్లీ: యునెటైడ్ కింగ్డమ్(యూకే)లోని యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇకపై భారత్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఇచ్చే ప్లస్ టూ సర్టిఫికెట్‌కు గుర్తింపునిచ్చేందుకు యూకేలోని యూనివర్సిటీలన్నీ అంగీకరించాయి. ఇప్పటివరకు అక్కడి చాలా విద్యాసంస్థలు సీబీఎస్ఈ ప్లస్ టూ సర్టిఫికెట్ ఆధారంగా భారతీయ విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి అనుమతించకపోయేవి. బ్రిటిష్ విధానంలో పాఠశాల విద్య భారత్ విధానంలో కన్నా ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హత సంపాదించాలంటే అదనంగా మరో కోర్సు చేయల్సిందిగా ఆ విద్యాసంస్థలు కోరేవి. దాంతో యూకేలో ఉన్నత విద్యలో చేరాలనుకునే విద్యార్థులు ఇబ్బంది పడేవారు. దాంతో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని యూకేతో చర్చించి, సానుకూల ఫలితం పొందిందని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వీసా సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్తున్న భారతీయ విద్యార్థులకు సాయపడేందుకు కూడా యూకే అంగీకరించిందన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన 6వ యూకే- ఇం డియా ద్వైపాక్షిక విద్యా సదస్సుకు ఆమె అధ్యక్షత వహించారు.