యూకే వర్సిటీల్లో సీబీఎస్ఈ +2కి గుర్తింపు
న్యూఢిల్లీ: యునెటైడ్ కింగ్‌డమ్(యూకే)లోని యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇకపై భారత్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఇచ్చే ప్లస్ టూ సర్టిఫికెట్‌కు గుర్తింపునిచ్చేందుకు యూకేలోని యూనివర్సిటీలన్నీ అంగీకరించాయి. ఇప్పటివరకు అక్కడి చాలా విద్యాసంస్థలు సీబీఎస్ఈ ప్లస్ టూ సర్టిఫికెట్ ఆధారంగా భారతీయ విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి అనుమతించకపోయేవి.
బ్రిటిష్ విధానంలో పాఠశాల విద్య భారత్ విధానంలో కన్నా ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హత సంపాదించాలంటే అదనంగా మరో కోర్సు చేయల్సిందిగా ఆ విద్యాసంస్థలు కోరేవి. దాంతో యూకేలో ఉన్నత విద్యలో చేరాలనుకునే విద్యార్థులు ఇబ్బంది పడేవారు. దాంతో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని యూకేతో చర్చించి, సానుకూల ఫలితం పొందిందని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.
వీసా సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్తున్న భారతీయ విద్యార్థులకు సాయపడేందుకు కూడా యూకే అంగీకరించిందన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన 6వ యూకే- ఇం డియా ద్వైపాక్షిక విద్యా సదస్సుకు ఆమె అధ్యక్షత వహించారు.