ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు | The Emergency at 40: you know the facts, now read the fiction | Sakshi
Sakshi News home page

ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు

Published Thu, Jun 25 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు

ఆ చీకటి యుగానికి 40 ఏళ్లు

స్వతంత్ర భారత చరిత్రపై చెరగని మచ్చ
ప్రజాస్వామ్యానికి ఎదురైన ఏకైక తొలి సవాలు అదే

 
బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత్‌లో.. ఈ ప్రజాస్వామ్యం ఎన్నాళ్లు మనగలుగుతుంది? అన్న ప్రశ్న ఆదిలోనే తలెత్తింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. కానీ.. సువిశాల భారతావనిలోని ప్రజలు.. భిన్న మతాలు, సంస్కృతుల కలయిక  కనుక దేశం త్వరగానే  ముక్కలతుందని చాలా మంది ‘జోస్యం’ చెప్పారు. కానీ.. ఆ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ ఏడు దశాబ్దాలుగా భారత్ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. భారత్‌తో పాటు స్వాతంత్య్రం పొందిన పొరుగు దేశాలు.. సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనల్లో  కూరుకుపోతూ ఉంటే.. భారత్‌లో  ప్రజాస్వామ్య పునాదులు రోజురోజుకూ బలపడుతున్నాయి.

కానీ.. ఈ 70 ఏళ్ల ప్రజాస్వామ్య పయనంలో భారత్ కూడా ఒక పెను సవాలు ఎదుర్కొంది.  ఒక చీకటి అధ్యాయం లిఖితమైంది. సరిగ్గా 40 ఏళ్ల కిందట.. ఈ దేశంలో ‘ఎమర్జెన్సీ’ పేరుతో నియంతృత్వం జూలు విదిల్చింది. ప్రజాస్వామ్య మూల స్తంభాలను నాటి నియంతృత్వ ప్రభుత్వం తన కబంధ హస్తాల్లో బంధించింది. విపక్షాన్ని జైల్లో నెట్టి, పత్రికల గొంతు నొక్కేసింది. శాసనవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని చట్టాలను మార్చేసింది. 21 నెలలుసాగిన ఆ చీకటి యుగంలో.. పౌరుల ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి.  వాక్‌స్వాతంత్య్రమే కాదు.. జీవన స్వాతంత్య్రమూ లేదని  నాటి ప్రభుత్వమే చెప్పింది. 

ఆనాటి నియంతృత్వ ప్రభుత్వం ఏక వ్యక్తి ప్రభుత్వం.. ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఆమె కోటరీ ప్రభుత్వం. ఆ చీకటి యుగం.. 1975 జూన్ 25 అర్ధరాత్రితో మొదలై.. 1977 మార్చి 21 వరకూ కొనసాగింది. ప్రజాస్వామ్యానికి ఎదురైన ఆ పెను సవాలును భారత్ అధిగమించింది. అందుకు  కారణం.. ప్రజాస్వామ్య విలువలపై ఈ దేశ ప్రజల అచంచల విశ్వాసం, రాజీలేని పోరు! ఆ ఎమర్జెన్సీ ఆరంభానికి ఈ గురువారానికి 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ తరుణంలో ఎప్పటిలానే ‘ఎమర్జెన్సీ’పై చర్చ మొదలైంది. అలాంటి నియంతృత్వ పాలన ముప్పు  ఇంకా తొలగిపోలేదని.. నాడు జైలు నిర్బంధంలో ఉన్న అద్వానీ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల కిందట ‘ఎమర్జెన్సీ’ పూర్వాపరాలపై ‘సాక్షి’ ఫోకస్..

 
ఎమర్జెన్సీకి కారణాలేమిటి?
ఎమర్జెన్సీకి ముందు ఇందిరాగాంధీ చాలా ప్రజాదరణగల నాయకురాలు. 1966లో నాటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి మరణించిన తర్వాత.. తొలి భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ కుమార్తె అయిన ఇందిరను కాంగ్రెస్ ప్రధానిగా ఎన్నుకుంది. కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్వహించిన ఓటింగ్‌లో మొరార్జీదేశాయ్‌ను 355 - 169 ఓట్ల తేడాతో ఓడించి.. భారత తొలి మహిళా ప్రధానిగా ఆమె పగ్గాలు చేపట్టారు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పటికీ.. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. మొత్తం 518 సీట్లలో 352 సీట్లు గెలుచుకుంది. 1971లో పాక్‌తో యుద్ధంలో భారత్ గెలవటంతో ఆమె ప్రతిష్ట పెరిగింది.
 
కానీ.. రెండేళ్లు తిరిగేసరికే ఇందిర ప్రతిష్ట మసకబారటం మొదలైంది. ఆమె సర్కారుతో పాటు.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గుజరాత్‌లో నవ నిర్మాణ్ ఉద్యమం, బిహార్‌లో జయప్రకాష్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ఊపందుకున్నాయి. దేశ వ్యాప్తంగా రైల్వే కార్మికులు సమ్మె చేశారు. దీనిపై ఇందిర ప్రభుత్వం కఠినంగా విరుచుకుపడింది. వేలాది మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి, వారి కుటుంబాలను క్వార్టర్ల నుంచి గెంటివేసింది. ప్రతిపక్షాల నుంచి ఇందిర సర్కారుపై దాడి ముమ్మరమైంది. పార్లమెంటులో సైతం ఇందిర కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 1966 నుంచి తొమ్మిదేళ్లలో పది అవిశ్వాస తీర్మానాలను ఇందిర ఎదుర్కొన్నారు.
 
 అలహాబాద్ హైకోర్టు తీర్పు...
ఈ పరిస్థితుల్లో.. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు.. 1971 ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. ఆ ఎన్నికలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ నిధులను ప్రచారానికి వినియోగించారని.. అదే స్థానంలో ఆమె ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయిణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఇందిర మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిషేధం విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిర ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లతో ప్రతిపక్షాల నుంచి భారీ నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాల నేతలు రాష్ట్రపతిని కలసి.. హైకోర్టు తీర్పుతో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, ఇందిరను తొలగించాలని కోరారు. కాంగ్రెస్‌లోనూ ఇందిర రాజీనామా కోసం డిమాండ్లు మొదలయ్యాయి.
 
 సుప్రీంకోర్టు ఉత్తర్వులు...
 హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పుపై 1975 జూన్ 24న స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇందిర కొన్ని షరతులకు లోబడి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగవచ్చని అనుమతిచ్చింది. ఒక ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో కానీ, ఓటింగ్‌లో కానీ పాల్గొనరాదని, లోక్‌సభ సభ్యురాలిగా వేతనాలు అందుకోరాదని ఆదేశించింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిర లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించినది అయినందున.. ఈ షరతులు ఆమె ప్రధానమంత్రి హోదాపై ప్రభావం చూపబోవని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాని హోదాలో ఆమె పార్లమెంటు సమావేశాలకు హాజరుకావచ్చునని (ఓటింగ్ హక్కు లేకుండా), ప్రధానిగా ఇతర విధులూ నిర్వర్తించవచ్చని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి.
 
 జేపీ ‘సహాయ నిరాకరణ’ పిలుపు...
అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందిర రాజీనామా చేసి తప్పుకోవాలంటూ జయప్రకాష్ నారాయణ్(జేపీ) డిమాండ్ చేస్తూ ‘సంపూర్ణ విప్లవం’ పిలుపుతో భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో.. సైన్యం, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇందిర సర్కారుకు ‘సహాయ నిరాకరణ’ చేయాలని, ఆమె ఆదేశాలను పాటించవద్దని, రాజ్యాంగానికి కట్టుబడాలని జేపీ పిలుపునిచ్చారు. ఇందిర రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు.  
 
 పత్రికలపై ఆంక్షలు...
ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభమైన పత్రి కా రంగం ఇబ్బందుల పాలైంది. పత్రికలు, చానళ్లు, రేడియో ప్రసారాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రచురించే, ప్రసారం చేసే వార్తలు, కథనాలను ప్రభుత్వానికి చూపించి, ఆమోదం పొందాలని షరతులు విధించారు. జేపీ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మినహా.. ఈ ఆంక్షలను ధిక్కరించే ధైర్యం మరెవరూ చేయలేకపోయారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సంపాదకీయం స్థానాన్ని ఖాళీగానే ఉంచి ముద్రించింది.  సంజయ్ ఆదేశాలను పాటిం చేందుకు తిరస్కరించినందుకు.. అప్పటి కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ఐ.కె.గుజ్రాల్‌ను కూడా ఇందిర తొలగించి.. విద్యాచరణ్‌శుక్లాను ఆయన స్థానంలో నియమించారు.
 
పౌరులకు హక్కులు లేవు.. కోర్టులు ప్రశ్నించ జాలవు..
ఎమర్జెన్సీ ప్రకటనతోనే దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. ఎవరినైనా ఎటువంటి ఆరోపణా లేకుండా, ఎటువంటి విచారణా లేకుండా అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచే అధికారం ప్రభుత్వానికి దక్కింది. దీంతో.. ప్రభుత్వ వ్యతిరేకులు అనుకున్న వారినందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించటం షరా మామూలుగా మారింది.  దేశవ్యాప్తంగా మొత్తం 1.40 లక్షల మందిని ఎటువంటి విచారణా లేకుండా నిర్బంధించినట్లు అంచనా. ఎమర్జెన్సీలో ఇందిర చట్టాలను యథేచ్ఛగా తిరగరాశారు.

తనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హం చేసిన కేసులో అభియోగాల నుంచి విముక్తి లభించే విధంగా.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని  సవరించారు. తన ఆదేశాలు, ఆర్డినెన్సులను కోర్టులు సమీక్షించకుండే ఉండేలా కొన్ని చట్టాలను సవరించారు. ఎమర్జెన్సీలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను వాయిదా వేశారు. తనను వ్యతిరేకించే ప్రభుత్వాలు ఉన్న గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం 356 అధికరణను వినియోగించి రాష్ట్రపతి పాలనను విధించారు.
 
 ఎమర్జెన్సీ ఎత్తివేత.. ఇందిర పరాజయం...
 ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విక్షాలన్నీ ఉద్యమించాయి. పంజాబ్‌లో సిక్కులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జనతా పార్టీ, సీపీఎం, ఆర్‌ఎస్‌ఎస్ కూడా జైళ్లలో ఉన్న నేతలు, అజ్ఞాతంలో ఉన్న కార్యకర్తల సారథ్యంలో ఉద్యమాలు కొనసాగించాయి. ఈ పరిస్థితుల్లో 21 నెలల పాటు సాగిన చీకటి పాలనకు స్వయంగా ఇందిరే తెరదించారు. అన్ని వర్గాల వ్యతిరేకత, విదేశీ పరిశీలకుల విమర్శలు దీనికి కారణమని భావిస్తున్నారు. పైగా.. ఎన్నికల్లో తాను మళ్లీ గెలుస్తానని ఆమె ధీమాగా ఉన్నారని పరిశీలకులు అంటారు. 1976 ఫిబ్రవరి 4న లోక్‌సభ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించిన ఇందిర సర్కారు.. ఆ మరుసటి ఏడాది జనవరి 18న లోక్‌సభను రద్దు చేసింది. మార్చిలో ఎన్నికలు ప్రకటించింది.

అరెస్ట్ చేసిన నాయకులందరినీ విడుదల చేసి మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించింది. 1977 మార్చి నాటి ఎన్నికల్లో.. భారత ప్రజానీకం ఆగ్రహావేశాలను ఇందిర చవిచూశారు. స్వాతంత్య్రానంతరం 30 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తొలిసారి ఘోరంగా ఓడించారు. ఇందిర,  సంజయ్ స్వయంగా పరాజయం పాలయ్యారు. జేపీ నేతృత్వంలోని జనతా పార్టీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఒకప్పుడు.. ఇందిర ప్రభుత్వంలోనే ఉప ప్రధానిగా పనిచేసిన మొరార్జీదేశాయ్.. ఎమర్జెన్సీ తర్వాత తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
 
ఇందిర అరెస్టు.. మళ్లీ గెలుపు...
ఈ ‘జనతా’ ప్రభుత్వం.. ఎమర్జెన్సీ అకృత్యాలపై 1977 మే 28న షా కమిషన్‌ను నియమించింది. ఇందిర ఆమె అవసరాల కోసమే ఎమర్జెన్సీ తెచ్చారని షా తప్పుబట్టారు. దీనికి సంబంధించిన ఆరోపణలపై.. జనతా ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చౌదరి చరణ్‌సింగ్.. ఇందిర, సంజయ్‌ల అరెస్టుకు ఆదేశించారు. అయితే.. ఈ అరెస్టులు, ఆపై సుదీర్ఘ విచారణలు.. సమస్యలు పరిష్కరించటంలో జనతా పార్టీ వైఫల్యం కలగలసి.. అనంతర కాలంలో ఇందిరపై ప్రజల్లో సానుభూతి పెరిగేందుకు దోహదపడ్డాయి. ఇందిర తన ప్రసంగాల్లో ‘చేసిన పొరపాట్ల’కు క్షమాపణలు చెప్పటం వంటి పరిణామాలతో.. మూడేళ్లు తిరక్కముందే 1980 ఎన్నికల్లో ఆమె మళ్లీ అధికారంలోకి వచ్చారు.
 
ఎమర్జెన్సీ విధించటం అంత సులభమా?
1978కి ముందు.. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించటం.. ఇప్పటితో పోలిస్తే సులభమే. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ.. 1978లో రాజ్యాంగ నిబంధనలను సవరించి ఎమర్జెన్సీ విధించటాన్ని మరింత కఠినతరం చేసింది. ఇందిర నాడు ‘అంతర్గత అలజడుల’ ప్రాతిపదికన ఎమర్జెన్సీని విధించారు. కానీ.. జనతా సర్కారు ఆ పదాన్ని ‘సాయుధ తిరుగుబాటు’గా మార్చి మరింత నిర్దిష్టతను ఇచ్చింది. ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు.. అందుకు తొలుత రాష్ట్రపతి ఆమోదం పొందారు. ఆ మరుసటి రోజున తన మంత్రివర్గానికి ఆ విషయాన్ని తెలియజేశారు.
 
1978లో చేసిన సవరణ ప్రకారం.. రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ ప్రకటన చేయటానికి ముందు.. దానికి కేంద్ర మంత్రివర్గం అంగీకారం తప్పనిసరి. 1978 సవరణకు ముందు.. ఎమర్జెన్సీ ప్రకటనకు కానీ, దానిని పొడిగించటానికి కానీ.. పార్లమెంటులో సాధారణ మెజారిటీ ఆమోదం ఉంటే సరిపోతుంది. అంటే.. హాజరైన సభ్యుల్లో ఓటు వేసిన వారిలో సగం మంది కన్నా ఒక్కరు ఎక్కువగా ఆమోదం తెలిపితే సరిపోతుంది. దీనిని సవరించి.. పార్లమెంటు ఆమోదాన్ని కఠినతరం చేశారు. ఎమర్జెన్సీ విధించటానికి కానీ, కొనసాగించటానికి కానీ.. పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ.. అంటే హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండు వంతులు.. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో (హాజరుకాని వారితో సహా) కనీసం సగం మంది ఆమోదించాలని మార్చారు.
 
 ఆ రాత్రే ఎమర్జెన్సీ.. అరెస్టులు...
జూన్ 25 అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు.. ఇందిర సిఫారసుతో నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారు. దేశంలో ‘అంతర్గత అలజడులు’ చెలరేగుతున్నాయంటూ ఎమర్జెన్సీ ఉత్తర్వులు జారీచేశారు. దేశరక్షణ, ప్రజా ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇందిర సమర్థించుకున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం ఎస్.ఎస్.రే తదితరుల ప్రోద్బలం ప్రబలంగా ఉందన్న వాదనలు ఉన్నాయి.

ఆ రాత్రికి రాత్రే.. ప్రధాన వార్తా పత్రికలన్నిటికీ కరెంటు నిలిపివేశారు. ఇందిరను ప్రశ్నిస్తున్న దాదాపు 100 మంది నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. వీరిలో జేపీ, మొరార్జీ దేశాయ్, ఎల్.కె.అద్వానీ, అటల్ బిహారీ వాజపేయి వంటి నేతలు ఉన్నారు. దాదాపు ప్రతిపక్షమంతా జైల్లోనే అన్న స్థితి ఉండేది. నాలుగు మత, రాజకీయ, విప్లవ పార్టీలన నిషేధించారు. వీటిలో ఆనంద్‌మార్గ్, ఆర్‌ఎస్‌ఎస్, జమాత్-ఎ-ఇస్లామీ వం టి సంస్థలున్నా యి. తొలి విడత అరెస్టుల తర్వాత మిగతా నాయకు లు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  
 
సంజయ్‌గాంధీ అకృత్యాలు..
ఎమర్జెన్సీ ద్వారా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాదు.. అప్పటికే ‘రాజ్యాంగేతర శక్తి’గా పేరుపడ్డ ఆమె తనయుడు సంజయ్‌గాంధీ కూడా అపరిమిత అధికారాలు చలాయించారు. ముఖ్యంగా దేశంలో జనాభా పెరుగుదలను తగ్గించేందు కోసమంటూ కుటుంబ నియంత్రణ పేరుతో.. ఆయన లక్షలాది మందికి నిర్బంధ గర్భనిరోధ శస్త్రచికిత్సలు చేయించారు.

ఒరిగిపోగలం కానీ.. మేం తల వంచలేం! సత్యం సంఘర్షణ.. అధికారంతో న్యాయం పోరాటం.. నిరంకుశంతో అంధకారం సవాలు విసిరింది కిరణమే తుది అస్త్రం అవుతుంది!
 - అటల్ బిహారీ వాజపేయి
 (ఎమర్జెన్సీ సమయంలో జైల్లో రాసిన కవిత)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement