సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరకు దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ సైతం ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది. ఈ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా దీన్ని నిర్వహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెల 22న రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీతోపాటు సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య శాఖా మంత్రిని ఈ కార్యక్రమానికి తీసుకువస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ స్థాయిని శంకుస్థాపనలోనే చూపించాలని ఆత్రుత పడుతోంది.
వెంకటపాలెంలో 50 ఎకరాల్లో నిర్వహణ
సీడ్‌క్యాపిటల్ ప్రాంతంలోని వెంకటపాలెంలో 50 ఎకరాలను కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. వంద మంది కూర్చునే వేదిక, వెయ్యి మంది విశిష్ట అతిథులు, 50 వేల మంది ప్రజలతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు.
అక్టోబర్ 1 నుంచే ప్రచారం : శంకుస్థాపన ప్రచారాన్ని అక్టోబర్ 1 నుంచే మొదలు పెట్టనున్నారు. పత్రికలు, టీవీలతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ అవసరమైతే ఢిల్లీలో ఈ ప్రమోషనల్ ఆడియో, వీడియోలను ప్రదర్శిస్తారు. ఇందు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు పలు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సంప్రదించినట్లు సమాచారం.
రాజధాని శంకుస్థాపనా ప్రైవేటుకే !
Published Mon, Sep 21 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement
Advertisement