ఇక థియేటర్లలో కొత్త సౌండ్ సిస్టమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని సినిమా ప్రేక్షకులు ఇక నుంచి థియేటర్లలో నూతన అనుభూతికి లోనుకానున్నారు. బెల్జియం కంపెనీ ఆరో టెక్నాలజీస్ రూపొందించిన ‘ఆరో 11.1’ అనే అత్యాధునిక 3డీ సౌండ్ సిస్టమ్‌ను సినీ నిర్మాణ రంగంలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ వివిధ థియేటర్లలో పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్-4లో తొలుత ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. త్వర లో 100 థియేటర్లలో అందుబాటులోకి రానుంది. ప్రేక్షకులు మంచి శబ్దాన్ని కోరుకుంటున్నారని, ఈ సౌండ్ సిస్టమ్ కలిగిన థియేటర్లు హౌస్ ఫుల్‌తో నడుస్తున్నాయని సురేష్ ప్రొడక్షన్స్ ఎండీ డి.సురేష్ బాబు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. సినిమా ఆడియో మిక్సింగ్ కోసం రామానాయుడు స్టూడియోల్లో ఆరో 3డీ టెక్నాలజీని వినియోగిస్తామని వెల్లడించారు. రేసుగుర్రం సినిమా ఈ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుందని చెప్పారు.ఆరో టెక్నాలజీ కోసం ఒక్కో థియేటర్‌కు రూ.12-15 లక్షల వ్యయం అవుతుంది. దశలవారీగా రాష్ట్రంలోని ప్రధాన థియేటర్లకు విస్తరిస్తాం’ అని సురేష్ బాబు వివరించారు.
హెడ్‌ఫోన్స్ కూడా..
ప్రేక్షకులు మైమరచిపోయేలా, సహజ సిద్ధంగా శబ్దం ఉంటుందని ఆరో టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విల్‌ఫ్రైడ్ వాన్ బాలెన్ పేర్కొన్నారు. ఆరో పరిజ్ఞానంతో 2014లో మ్యూజిక్ సిస్టమ్, హెడ్‌ఫోన్స్ వంటి మరిన్ని ఉత్పాదనలను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. నాలుగేళ్లు శ్రమించి సినిమా విభాగం కోసం ఆరో 11.1 సౌండ్ సిస్టమ్‌ను రూపొందించినట్టు చెప్పారు. థియేటర్‌లో మూడు దశల్లో ఈ వ్యవస్థను అమరుస్తామని, ఏ సీట్లో కూర్చున్నా శబ్దం ఒకేలా వినపడుతుందని వివరించారు. ఆరో ఉత్పత్తులను దేశంలో బార్కో ఇండియా పంపిణీ చేస్తుంది.