ఒక్కటే నంబర్‌తో ఈపీఎఫ్ నిర్వహణ
కోల్‌కత్తా: దేశంలోని దాదాపు నాలుగు కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిర్వహణ మరింత సుల భతరం కానుంది. ఒకే ఒక్క సార్వత్రిక నంబర్ విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈ కొత్త విధానాన్ని అనుసరించనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని కేంద్ర భవిష్య నిధి (సీపీఎఫ్) కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు.
సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నూతన విధానాన్ని విజయవంతంగా అమలుచేయగలిగితే ఉద్యోగుల పీఎఫ్ నిర్వహణలో సమూల మార్పు లు చోటుచేసుకుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న యాజమాన్య ఆధారిత విధానం పూర్తిగా ఉద్యోగి కేంద్రంగా మారుతుందని అన్నారు. ఉద్యోగి వేరే సంస్థకు మారినా, మరో ప్రాంతానికి బదిలీ అయినా అతని సార్వత్రిక భవిష్యనిధి నంబరు బ్యాంకు ఖాతా నంబర్‌లా శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్ ద్వారా బది లీ చేసుకొనే సౌలభ్యం ఈనెల నుంచి అందుబాటులోకి వస్తుం దని చెప్పారు. ఇక పెన్షనర్లందరికీ నవంబర్ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకల్లా పింఛన్ చేతికందుతుందని భరోసా ఇచ్చారు. ఇందుకోసం 40 లక్షల మంది పెన్షనర్ల ఖాతాలను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్‌తో అనుసంధానం చేశామన్నారు.