
పాస్‌పోర్ట్ నిబంధనలు ఇక సరళం
పుట్టిన తేదీకి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు
► పదో తరగతి సర్టిఫికెట్, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, బీమా పత్రాల్లో ఏదైనా ఒక్కటి చాలు
► అటెస్టేషన్/నోటరీలకు స్వస్తి
న్యూఢిల్లీ/విశాఖపట్నం: కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది.వివిధ కేటగిరీలకు చెందిన వారికి మినహాయింపులు ఇచ్చింది. విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఈ వివరాలను శుక్రవారం వెల్లడించారు. సవరించిన నిబంధనల్లో ముఖ్యమైనవి
► పుట్టిన తేదీని నిర్ధారించేందుకు తప్పనిసరి అయిన బర్త్ సర్టిఫికెట్ ఇకమీదట అవసరం లేదు. పదో తరగతి మెమో, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, ఏదైనా ప్రభుత్వరంగ సంస్థ జారీచేసిన బీమా పాలసీ పత్రం.. వీటిలో ఏదైనా ఒకదాన్ని ఆధారంగా చూపితే సరిపోతుంది. అయితే వాటిలో పుట్టినతేదీ ఉండాలి.
► గతంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉండగా, ఇకపై ఎవరి సంరక్షణలో ఉన్నారో వారి వివరాలు తెలపాలి. పాస్‌పోర్ట్ పుస్తకంలో అభ్యర్థి కోరిక మేరకు తల్లి లేదా తండ్రి పేరును నమోదు చేస్తారు. దరఖాస్తులో అనుబంధ వివరాలను తెల్ల కాగితం మీద సంతకం చేసి రాసివ్వాలి. నోటరీ, అటెస్టేషన్‌లకు పూర్తిగా స్వస్తి చెప్పారు.
► పెళ్లయిన అభ్యర్థులకు అనెక్సర్ ‘కె’ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పనిలేకుండా చేశారు. అభ్యర్థి విడాకులు పొందితే కోర్టు మంజూరు చేసిన పత్రాలు సమర్పించాలి. భర్త లేదా భార్య పేరును దరఖాస్తులో రాయనక్కర్లేదు.
► దత్తత తీసుకున్న పిల్లల విషయంలో రిజిస్ట్రేషన్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అది లేకపోతే దరఖాస్తుదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ళీ ప్రభుత్వోద్యోగులు గుర్తింపు పత్రంగా అనెక్సర్ ‘బి’, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌గా అనెక్సర్ ‘ఎం’ సమర్పించాలి. అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనెక్సర్ ‘ఎన్’ ఇవ్వాలి. సాధువులు, సన్యాసులు దరఖాస్తులో తల్లిదండ్రుల పేర్లకు బదులుగా తమ గురువు పేరు, గుర్తింపు పత్రం సమర్పించాలి. కాగా, నూతన నిబంధనలు ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. గతంలో జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారంతా ఆర్డీవో జారీ చేసిన పత్రం అందించాల్సిన నిబంధన ఉండేది. ఆ నిబంధన రద్దయింది.