బలంలేక రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇక్కట్లు
ఈ టర్‌మ మొత్తం ఇదే పరిస్థితి
2016లో పెరగనున్న బీజేపీ బలం ళీ అయినా పెద్దల సభలో మెజారిటీకి చాలా దూరం
వచ్చే రెండేళ్లలో రాష్ట్రాల్లో గెలిస్తే... 2018లో మెజారిటీకి దగ్గరగా వస్తామని కమలనాథుల ఆశ
అప్పటిదాకా ఇవే తిప్పలు!
బిహార్ విజయంతో మరింత దగ్గరవుతున్న విపక్షాలు
బిల్లుల ఆమోదం ఎన్డీయేకు కత్తిమీద సామే
ఎన్డీయే పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటింది. అయితే రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ ప్రభుత్వం కీలక బిల్లులను నెగ్గించుకోలేకపోతోంది. భూసేకరణ సవరణ బిల్లు లోక్‌సభలో నెగ్గినా రాజ్యసభలో విపక్షాల పట్టుతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సి వచ్చింది. అక్కడ కూడా మరోమార్గం లేకపోవడంతో కీలకాంశాల్లో సర్కారు వెనక్కి తగ్గింది. ప్రపంచదేశాలను చుట్టివస్తున్న మోదీ ఎక్కడికెళ్లినా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పలురకాల పన్నులను (కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరుగా పన్నులు వేయడం) తొలగించి ఏకీకృత ‘వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును తేవడం ద్వారా భారత్‌లో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీన్ని 2016 ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి తెస్తామని కేంద్రం ప్రకటించుకుంది కూడా.
అయితే రాజ్యసభలో విపక్షాల వ్యతిరేకతతో వర్షాకాల సమావేశాల్లో దీన్ని తేలేకపోయింది. అంతరాయాలతో వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈనెల 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమైన జీఎస్‌టీ బిల్లును నెగ్గించుకోవడానికి ప్రభుత్వం విపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. స్పష్టమైన ప్రజాతీర్పుతో అధికారం చేపట్టిన మోదీ సర్కారు రాజ్యసభలో మెజారిటీ లేని మూలంగా కీలక బిల్లులను తేలేకపోతోంది. ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాలు ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉంటుంది? బీజేపీకి ఎప్పటికి మెజారిటీ వస్తుంది? అనే అంశాలపై ‘సాక్షి’ ఫోకస్....
రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 245... కాగా ఇందులో మూడు ఖాళీలున్నాయి. రెండు నామినేటెడ్ ఖాళీలు కాగా, ఒకటి ఒడిశా నుంచి ఖాళీ ఉంది. మిగిలిన 242లో ఎన్డీయే, దాని మిత్రపక్షాల బలం 62 మాత్రమే (బీజేపీ 48, టీడీపీ 6, అకాలీదళ్ 3, శివసేన 3, పీడీపీ 2). అన్నా డీఎంకే (12), బిజూ జనతాదళ్ (6) అంశాల వారీగా మద్దతునిస్తున్నాయి. ఈ రెండు పార్టీలను కలుపుకొన్నా ప్రభుత్వం బలం రాజ్యసభలో 80 దాటడం లేదు. ఇటీవలి కాలంలో శరద్‌పవార్ (ఎన్‌సీపీకి ఆరుగురు సభ్యులున్నారు) బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు కనపడుతున్నాయి.
ఈసారి సమావేశాల్లో ఎన్‌సీపీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ (67) ఉంది. వామపక్షాలు (సీపీఎం 9, సీపీఐ 1), సమాజ్‌వాదీ (15), బీఎస్‌పీ (10), జేడీయూ (12)లు, ఆయా రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీని వ్యతిరేకించే ఇతర చిన్నాచితక పార్టీలు కలిసి... ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. కీలక బిల్లులను అడ్డుకోగలుగుతున్నాయి. ఈ పార్టీలన్నీ రాజ్యసభలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో ఏకమవుతున్నాయి (బిహార్‌లో మహాకూటమి ప్రయోగం విజయవంతం అవ్వడంతో ఇకపై విపక్షాల ఐక్యత మరింత పెరుగుతుంది). దాంతో మోదీ సర్కారు సంకటస్థితిని ఎదుర్కొంటోంది.
2016 ముగిసేసరికి రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది ఏకంగా 76 స్థానాలు ఖాళీ కానున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం పొగొట్టుకుంది. ఈ రాష్ట్రాల నుంచి ఖాళీ అయ్యే స్థానాల్లో కాంగ్రెస్ సభ్యులు ఎన్నిక కాలేరు. వీటిలో మెజారిటీ బీజేపీ లేదా దాని మిత్రపక్షాల ఖాతాలోకి వెళతాయి కాబట్టి బీజేపీ బలం పెరుగుతుంది. అలాగే కర్ణాటకలో బీజేపీ బలం తగ్గుతుంది (అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది). మొత్తం మీద 2016లో కాంగ్రెస్ స్థానాలు తగ్గి... బీజేపీ స్థానాలు పెరగడం మూలంగా బీజేపీ పెద్దల సభలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.
జూన్‌లో 17 స్థానాలు, జులైలో 34 స్థానాలు ఖాళీ కానున్నాయి. అంటే 2016 జులై ముగిసేసరికి బీజేపీ సంఖ్యాబలం మెరుగవుతుంది. అయినప్పటికీ ఏకతాటిపై వస్తున్న విపక్షాలను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 4 ఖాళీలు (జైరాం రమేష్, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, జేడీ శీలం), తెలంగాణలో 2 ఖాళీలు (గుండు సుధారాణి, వి.హనుమంతరావు) రానున్నాయి. 2016లో నాలుగు అంతకుమించి స్థానాలు ఖాళీ అవుతున్న రాష్ట్రాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కచూస్తే...
బిహార్ ఓటమితో ‘మహా’ దెబ్బ
బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీ ప్రతిష్ట ఎంతగా దెబ్బతీశాయో అంతకంటే ఎక్కువగా రాజ్యసభలో బీజేపీ మెజారిటీ ఆశలకు భంగకరంగా పరిణమించాయి. ఎందుకంటే 2016లో బిహార్ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా... ఇందులో ఒక్కటి మాత్రమే బీజేపీ నెగ్గగలదు. 2018లో ఖాళీ అయ్యే ఆరు స్థానాల్లోనూ బీజేపీ ఖాతాలో ఒకటే పడుతుంది. అంటే మొత్తం 11 స్థానాల్లో బీజేపీ దక్కేవి రెండే.
మహరాష్ట్రలో పెరిగేది రెండు
మహారాష్ట్రలో వచ్చే ఏడాది ఆరుగురు రిటైరవుతున్నారు. ఇందులో కాంగ్రెస్, ఎన్‌సీపీలకు ఇద్దరేసి సభ్యులున్నారు. బీజేపీ, శివసేనలకు చెందిన ఒక్కొక్కరు రిటైరవుతారు. మొత్తం ఆరుస్థానాల్లో శివసేనతో కలిపి బీజేపీ నాలుగు దక్కించుకోగలుగుతుంది. పంజాబ్‌లో ఏడు ఖాళీలు రానున్నాయి. ఇందులో మిత్రపక్షమైన అకాలీదళ్‌తో కలిసి బీజేపీకి నాలుగు సీట్లు దక్కుతాయి. అంటే నికరంగా ఎన్డీయేకు పంజాబ్‌లో పెరిగేదేమీ లేదు. ఇక రాజస్థాన్‌లో ఖాళీ అయ్యే నాలుగింటికి నాలుగు సీట్లను స్వతంత్రుల మద్దతుతో బీజేపీ గెలుచుకోగలుగుతుంది. ఇక్కడ బీజేపీకి పెరిగేవి రెండు సీట్లు.
తమిళనాడులో 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాకే... రాజ్యసభలో ఖాళీ అయ్యే ఆరు సీట్లకు ఎన్నికలొస్తాయి. అంటే కొత్త అసెంబ్లీలో అప్పటిబలాన్ని బట్టి ఆయా పార్టీలకు రాజ్యసభ సీట్లు దక్కుతాయి. ఉత్తరప్రదేశ్ నుంచి 2016లో మొత్తం 11 మంది రిటైరవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారికే అధిక సీట్లు దక్కనున్నాయి. రిటైరయ్యే పదకొండు మందిలో బీజేపీకి చెందిన ఒక సభ్యుడున్నారు. మళ్లీ ఈ ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాలి. యూపీలో ఒక్క రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవాలంటే 34 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీజేపీకి ఉన్నది 47 మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఒక్క రాజ్యసభ సీటు మాత్రమే వస్తుంది. ఇక్కడ సమాజ్‌వాది లాభపడనుంది.
ఆ పార్టీకి చెందిన ముగ్గురు రిటైర్ అవుతుండగా... ఏకంగా ఆరుగురిని (224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు) ఎస్‌పీ రాజ్యసభకు పంపనుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఎస్‌పీకి 15 మంది సభ్యులుండగా... 2016లో ఇది 18కి చేరనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రిటైరయ్యే వారిలో ఇద్దరు కాంగ్రెస్ (జైరాం రమేష్, జేడీ శీలం) ఉన్నారు. మరొకరు టీడీపీ (సుజనా చౌదరి), మరొకరు బీజేపీ (నిర్మలా సీతారామన్) ఉన్నారు. ఇక్కడ ఎన్డీయేకు పెరిగేది ఒక్క సీటు మాత్రమే. ఇద్దరు రిటైరవుతుండగా... 2016లో ఈ పార్టీలు ముగ్గురిని గెలిపించుకోగలుగుతాయి. మిగిలిన ఒక సీటు వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుంది.
కర్ణాటకలో 2016లో నలుగురు రిటైరవుతుండగా... ఇందులో బీజేపీకి చెందిన వారు ఇద్దరున్నారు. ఈసారి బీజేపీ ఒక్కరిని మాత్రమే గెలిపించుకోగలదు. బీజేపీకి పెరుగుతున్నవి పెద్దగా లేకున్నా... కాంగ్రెస్ నష్టపోయేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కమలదళం రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయి.
2018పైనే ఆశలు...
2017లో కేవలం పది సీట్లు మాత్రమే ఖాళీ అవుతున్నాయి. అయితే 2018లో పెద్దసంఖ్యలో 68 ఖాళీలు రానున్నాయి. ఈలోపు బీజేపీ 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో, 2017లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించాలి. అప్పుడే 2018లో ఖాళీ అయ్యే 68 స్థానాల్లో అత్యధికం దక్కించుకొని రాజ్యసభలో మెజారిటీ సాధించగలమనే ఆశలు పెట్టుకోగలుగుతుంది. అయితే పరిస్థితి చూస్తుంటే మాత్రం 2019లో మళ్లీ సాధారణ ఎన్నికలు జరిగే నాటికి కూడా ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ వచ్చేటట్లు లేదు. మోదీ ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా పెద్దల సభలో ఇబ్బందులు తప్పవు.
- ఎం.కృష్ణకాంత్ రెడ్డి, సాక్షి