‘నిర్భయ’ దోషి విడుదల
హైడ్రామా నడుమ విడుదలైన బాల నేరస్తుడు
♦ స్వచ్ఛంద సంస్థకు అప్పగించిన పోలీసులు..
♦ ‘నిర్భయ’ జ్యోతి సింగ్ తల్లిదండ్రుల ఆగ్రహం; ఢిల్లీలో కొనసాగిన నిరసనలు
♦ విడుదలను అడ్డుకునేందుకు ఢిల్లీ మహిళ కమిషన్ విఫల యత్నం
♦ శనివారం అర్ధరాత్రి దాటాక సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్ పిటిషన్..
♦ విడుదలపై స్టేకు వెకేషన్ బెంచ్ నిరాకరణ; నేడు విచారణ
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరుస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. ఆ బాల నేరస్తుడిని సొంతప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ పంపించకుండా.. అతడి కోరిక మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అక్కడ అతడిపై ఎలాంటి పోలీసు పర్యవేక్షణ ఉండదు. గ్యాంగ్ రేప్ బాధితురాలు జ్యోతి సింగ్ తల్లిదండ్రులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఈ ‘నిర్భయ’ దోషి విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జ్యోతి సింగ్‌పై అమానుష అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో అత్యంత పాశవికంగా ప్రవర్తించిన వ్యక్తికి.. కేవలం బాల నేరస్తుడన్న కారణంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించి, విడుదల చేయడాన్ని తప్పుబట్టారు.
పరివర్తన చెందేందుకు అవకాశమివ్వాలంటూ విడుదలను మరి కొందరు సమర్ధించారు. నిర్భయ దోషి విడుదలను వ్యతిరేకిస్తూ, అతడికి మరణశిక్ష విధించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ఆదివారం కూడా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. బాల నేరస్తుడి పునరావాసం కోసం రూ. 10 వేలు, కుట్టుమిషన్ అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. విడుదలైన తరువాత ఎక్కడికెళ్లాలనుకుంటున్నావన్న ప్రశ్నకు.. సొంత ప్రాంతమైన యూపీలోని బదాయూకు వెళ్తే తన ప్రాణాలకు ప్రమాదముందన్న భయాన్ని ఆ బాల నేరస్తుడు వ్యక్తపరిచాడని, అందువల్ల అతడి కోరిక మేరకు ఒక ఎన్జీవోకు అప్పగించామని పోలీసు వర్గాలు తెలిపాయి.
అర్ధరాత్రి దాటాక హైడ్రామా..
‘నిర్భయ’ కేసు దోషి విడుదలలో శనివారం రాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. ఆ బాల నేరస్తుడి విడుదలను నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మూడు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆ దోషి విడుదల దాదాపు ఖరారైన సమయంలో.. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలీవాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని, బాల నేరస్తుడి విడుదలను అడ్డుకోవాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఈ కేసును.. జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన వెకేషన్ బెంచ్‌కు అప్పగించారు.
అనంతరం, జస్టిస్ ఏకే గోయల్ నివాసంలో అత్యవసర విచారణ జరిపిన వెకేషన్‌బెంచ్.. రాత్రి 2 గంటల సమయంలో బాల నేరస్తుడి విడుదలపై స్టే విధించేందు కు నిరాకరించి, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విడుదలకు ముందు బాల నేరస్తుడి మానసిక స్థితిని పరీక్షించలేదని లాయర్లు గురుకృష్ణ కుమార్, దేవదత్ కామత్‌లు బెంచ్ ముందు వాదించారు. అలాగే, బాల నేరస్తుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ మూడేళ్ల కాలంలోనూ అతడిలో ఏ విధమైన పశ్చాత్తాపం కనిపించకపోగా, మరింత ఆవేశపూరితంగా మారాడంటూ ఇంటలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చిందని బెంచ్‌కు వివరించారు. ఈ సమయంలో అతడిని విడుదల చేయడం సమాజానికి ప్రమాదకరమని దేవదత్ కామత్ హెచ్చరించారు.
కోర్టు పరిధిలో ఉంది.. విడుదల చేయొద్దు
విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనున్నందున.. ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లినందున ఆ బాల నేరస్తుడిని ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం విడుదల చేయబోవని ఆశించామని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి తెలిపారు. దీనిపై జువనైల్ జస్టిస్ బోర్డ్‌కు లేఖ కూడా రాశానన్నారు. విడుదలను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని స్వాతి వ్యాఖ్యానించారు. అయితే, చివరి రోజు వరకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఆఖరి క్షణంలో సుప్రీంకోర్టు తలుపు తట్టడాన్ని బాధితురాలు జ్యోతిసింగ్ తల్లిదండ్రులు తప్పుబట్టారు. విడుదలను అడ్డుకోకుండా మూడేళ్లు కాలయాపన చేశారని జ్యోతిసింగ్ తల్లి ఆశాదేవీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపి, లాఠీ చార్జీలను భరిస్తే కానీ ఈ ప్రభుత్వాలు మాట వినిపించుకోవని జ్యోతిసింగ్ తండ్రి బద్రీసింగ్ పాండే అన్నారు.
రూ. 10 వేలు.. కుట్టుమిషన్: ఆ బాల నేరస్తుడికి పునరావాస ప్రణాళిక సిద్ధం చేశామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అతడికి రూ. 10 వేలు, ఒక కుట్టుమిషన్‌ను అందించి ఉపాధి కల్పించాలన్నది ఆ ప్రణాళిక అని పేర్కొంది.
విడుదల సరికాదు: ‘జువనైల్ జస్టిస్ చట్టం ప్రకారం, అతడిని జువనైల్ జస్టిస్‌బోర్టు నిర్బంధం నుంచి తప్పించవచ్చు. కానీ పూర్తిగా విడుదల చేయకూడదు. మొదట, ఆ వ్యక్తి మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉన్నాడా? అతడిలో మార్పు వచ్చిం దా? అనే విషయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ధారించాలి. అంతదాకాఅతడిని విడుదల చేయరాదు.’
- బాలనేరస్తుడిని విడుదల చేయొద్దంటూ పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి
రాజకీయాంశం కాదు: ‘ఇలాంటి వ్యక్తులు ఇంతత్వరగా విడుదల కావడానికి కారణమైన చట్టాల్లోని లోపాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది’
- నళిన్ కోహ్లి, బీజేపీ అధికార ప్రతినిధి
ఢిల్లీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: ‘ఢిల్లీ ప్రభుత్వం, డీసీడబ్ల్యూ రాజకీయాలు చేస్తున్నాయి. విడుదలకు ముందు రాత్రి వరకు డీసీడబ్ల్యూ ఎందుకు స్పందించలేదు?’
కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్
కేసు నేపథ్యం..
2012, డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీలో కదులుతు న్న బస్సులో మరో ఐదుగురితో కలిసి ఈ బాల నేరస్తుడు 23 ఏళ్ల యువతి జ్యోతిసింగ్‌పై పాశవిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ గ్యాంగ్ రేప్‌లో తీవ్రమైన గాయాల పాలైన ఆ యువతి కొన్ని రోజుల తరువాత చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రజ్వరిల్లాయి. దీని ఫలితంగానే నిర్భయ చట్టం రూపుదిద్దుకుంది. విచారణ అనంతరం.. బాల నేరస్తుల చట్టం ప్రకారం ఆ బాల నేరస్తుడు ఉత్తర ఢిల్లీలోని ‘ప్లేస్ ఆఫ్ సేఫ్టీ’అనే సంరక్షణ కేంద్రంలో మూడేళ్లు శిక్ష అనుభవించాలని జువనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పునిచ్చింది.
అత్యాచారానికి పాల్పడినవారిలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది ఇతడేనని, చేసిన నేరం దారుణమైనది కనుక, జువనైల్ చట్టం ప్రకారం మూడేళ్ల శిక్ష మాత్రమే విధిం చడం సరికాదన్న భావన అప్పట్లో వ్యక్తమైంది. మూడేళ్లు పూర్తికావడంతో అతడిని అధికారులు ఆదివారం విడుదల చేశారు. నిబంధనల ప్రకారం వివరాలను వెల్లడి చేయకూడదు కనుక అతడి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఆ బాల నేరస్తుడిని ఒక రోజు ముందే సంరక్షణ కేంద్రం నుంచి రహస్య ప్రాంతానికి తరలించారు.
పోలీసుల అదుపులో ‘నిర్భయ’ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషి విడుదలపై నిరసన తెలుపుతున్న ‘నిర్భయ’ జ్యోతి సింగ్ తల్లిదండ్రులు సహా పలువురు సామాజిక కార్యకర్తలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో జ్యోతిసింగ్ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీసింగ్ పాండే సహా పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఇండియాగేట్ వద్దకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన తెలపడం ప్రారంభించారు. ‘బాల నేరస్తుల చట్టంలో ప్రభుత్వం సవరణలు తెచ్చేందుకు ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలి?’ అని ఆశాదేవి ప్రశ్నించారు. ‘జైళ్లో ఉండాల్సినవారిని విడుదల చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం పోలీసులు వెంటాడుతున్నారు’ అన్నారు. ప్రధాని మోదీ మాకు రెండు నిమిషాల సమయమివ్వాలని డిమాండ్ చేశారు. కాసేపటి తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.