సాక్షి, ముంబై: ముంబై నగరంలో తెలుగువారి శోభ నానాటికి తరిగిపోతోంది. ఒకప్పటి రాజకీయ వైభోగం నేడు కానరావడంలేదు. శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి వారి పరిస్థితి దిగజారిపోయిందంటే కారణం తెలుగువారి మధ్య ఐక్యత లేకపోవడమే... ముంబైలో తెలుగువారు రాజకీయంగా అస్థిత్వం కోల్పోతున్నారు. స్వాతంత్య్రానికి ముందు సుమారు 1877 నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు 1950 వరకు తెలుగు వారు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉండేవారు. అనంతరం రాజకీయంగా తెలుగువారు తమ ఉనికిని కోల్పోతూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్, మరాఠ్వాడాలోని జాల్నా, విదర్భలోని చంద్రాపూర్, యావత్మాల్ తదితర జిల్లాల్లో రాజకీయంగా తెలుగువారి ఉనికిని కొందరు కాపాడుతున్నప్పటికీ ముంబైతోపాటు అత్యధికంగా తెలుగు ప్రజలుండే ఠాణే జిల్లాలోని భివండీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ముంబైలాంటి మహానగరం అభివృద్ధిలో తెలుగువారు క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ముంబైలో వర్లీ, పరెల్, కామాటిపురా, కొలాబా, బాంద్రా, గోరేగావ్, బోరివలి, ఘాట్కోపర్, అంటప్‌హిల్, వడాలా తదితర అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. గతంలో తొలిస్పీకర్‌గా ఎన్నికైన షాయాజీ శీలం ముంబైకి చెందిన తెలుగువారే. అలాంటి ఘనత ఉన్న ముంబై నుంచి ప్రస్తుతం రాజకీయంగా శాసించేస్థాయిలో తెలుగువారు ఎవరూ లేరు. సుమారు 5 దశాబ్దాల కాలం అందని ద్రాక్షగా ఉన్న కార్పొరేటర్ స్థానాన్ని 2012 కార్పొరేషన్ ఎన్నికల్లో ధారావి-ట్రాన్సిస్ట్ క్యాంపు వార్డు నుంచి అతిపిన్నవయస్కురాలైన అనుషా వల్పదాసి మాత్రమే విజయం సాధించి తెలుగు ప్రజల కల నెరవేరేలా చేసింది. భివండీలోని తూర్పు, పడమర రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు తెలుగవారివే ఉన్నా ఎమ్మెల్యేగా తెలుగువారు ఎదగలేకపోయారు.
ఐకమత్య లోపమే...?
రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి తమ సత్తాను చాటిన తెలుగువారు, నేడు వెనకబడిపోవడానికి కారణం ఐకమత్య లోపించడమేనని భావిస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది కుల సంఘాలుగా చీలిపోయారు. ఆ కులసంఘాల్లోనూ పలు చీలికలున్నాయి. రాజకీయంగా ఎదగాలని అనేక మంది తెలుగు ప్రజల్లో తపన, ఆసక్తి ఉన్నప్పటికీ ఐకమత్యంగా లేకపోవడంతో ఎదగలేకపోతున్నారు. తెలుగు ప్రజలందరూ ఏకమైతే కొన్ని నియోజకవర్గాల్లో వారి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పరిశీలకులు భావిస్తున్నారు.
మసకబారిన ‘తెలుగు’
Published Sun, Oct 12 2014 12:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement