థర్మాకోల్ ‘ఇళ్లు’ | Thermocol Pipe Section Manufacturers in Srikakulam | Sakshi
Sakshi News home page

థర్మాకోల్ ‘ఇళ్లు’

Published Fri, Aug 14 2015 2:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

థర్మాకోల్ ‘ఇళ్లు’ - Sakshi

థర్మాకోల్ ‘ఇళ్లు’

థర్మాకోల్‌తో చిన్నప్పుడు బొమ్మల ఇళ్లు కట్టాం.. కానీ అదే థర్మాకోల్‌తో నిజమైన ఇల్లు కట్టేస్తే.. అదీ తుపాను గాలులను సైతం తట్టుకునేలా నిర్మిస్తే.. ప్రకృతి విపత్తులు, తుపాన్ల సమయంలో 300 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల్ని కూడా తట్టుకునేలా ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ ఇళ్ల నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్నారు. థర్మాకోల్ షీట్లతో ఇళ్లు నిర్మించే ఈ సరికొత్త టెక్నాలజీని తొలిసారిగా ఇక్కడ వినియోగించడం విశేషం. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన తుపానుకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో

330 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక్కో ఫ్లాట్ రూ. 5.35 లక్షల వ్యయంతో మొత్తం రూ.25 కోట్ల ఖర్చుతో ఈ ఇళ్ల ప్రాజెక్టు చేపడుతున్నారు. 12 బ్లాక్‌ల్లో 8+8 (జీ+1) తరహాలో నిర్మాణాలు జరుగుతున్నాయి.    

- సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం

 
* థర్మాకోల్ షీట్లతో ఇళ్ల నిర్మాణం  
* సమయం... ఖర్చు ఆదా
* తుపాను బాధితులకోసం ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ ఇళ్లు  
* ఏపీలోనే తొలిసారిగా శ్రీకాకుళంలో అమలు
తక్కువ ఖర్చు.. ఎక్కువ ఉపయోగం

సాధారణ గృహాల మాదిరి పునాదులు, పిల్లర్లు, బీమ్‌లు ఇనుము, కాంక్రీట్‌తోనే నిర్మించి.. గోడలు, కిటికీలు, మరుగుదొడ్లకు థర్మాకోల్ షీట్లను వాడుతున్నారు. సాధారణ షీట్లు కాకుండా రసాయనాలు మిక్స్ చేసి ల్యాబ్‌ల్లో పరీక్షించిన థర్మాకోల్ షీట్లనే వినియోగిస్తున్నారు. స్లాబ్ సమయంలో ఈ షీట్లను వైర్లతో అల్లి చుట్టూ రసాయనాలు పూసి కాంక్రీట్ పూతతో పూర్తిచేస్తారు. థర్మాకోల్ షీట్ల చుట్టూ ఐరెన్ మిక్స్ అయిన(తుప్పు పట్టని) జీఐ వైరు ముక్కలతో ఓ బాక్స్ తయారు చేస్తారు. వాటిని వివిధ సైజుల ప్రకారం అమర్చుతారు.

రెండు పిల్లర్ల మధ్య, బాక్స్‌లమాదిరిగా వీటిని అమర్చి అనంతరం రసాయనాలు పూస్తారు. తరువాత గన్ పెయింటింగ్ తరహాలో కాంక్రీట్‌తో బలం వచ్చేలా చేస్తారు. గోడలు తయారైన తరువాత చూస్తే సాధారణ ఇళ్ల నిర్మాణం మాదిరిగానే కనిపిస్తుంది. మేకులు కొట్టుకునేందుకూ అనువుగా ఉంటుంది. సాధారణ గృహ నిర్మాణానికి ఏడాది కాలం పడితే థర్మాకోల్ షీట్లతో ఆరునెలల్లోనే పూర్తవుతుంది. తుపాను బాధితులకు గతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు ఏడెనిమిది లక్షల ఖర్చు అయ్యేది. కానీ ఈ విధానంతో రూ. 5.35 లక్షలతోనే పూర్తవుతోంది. ఒక్కో ఫ్లాటుకు రూ.500 విలువ చేసే 2ఇన్‌టూ3 మీటర్లుండే 26 షీట్లను ఉపమోగించి గోడలు నిర్మించుకోవచ్చు.
 
ప్రత్యేకతలు.. ఇవీ
ఈ థర్మాకోల్ ఇళ్ల వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా చేయవచ్చు. భారీ తుపాన్లను సైతం ఇవి తట్టుకోగలవు. అగ్ని ప్రమాదాలు సంభవించినా ప్రాణ/ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలుండవు. శబ్దకాలుష్యం నుంచి విముక్తితోపాటు వేసవిలో చల్లదనం పొందొచ్చు. ఈ నిర్మాణాలకు రూ.12 వేలతో మరుగుదొడ్ల నిర్మాణ ఖర్చును కేంద్రం భరిస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

చెన్నైకు చెందిన ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్ట్రక్చరల్ సెంటర్’ (సీఐఎస్‌ఆర్) సంస్థ థర్మాకోల్ షీట్ల పంపిణీలో కీలక బాధ్యత వహిస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిస్తే రాష్ట్రవ్యాప్తంగా నాలుగుచోట్ల ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేస్తామని ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇటుక నిర్మాణాలకు భవిష్యత్తులో ఇబ్బందులేర్పడే అవకాశాలుండడంతో 12ఎంఎం చిప్స్ సహా థర్మాకోల్ షీట్లను ఉపయోగిస్తున్నామని ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement