కొనేముందు... ఒక్కమాట..! | think before buying | Sakshi
Sakshi News home page

కొనేముందు... ఒక్కమాట..!

Published Sun, Jan 5 2014 1:22 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

కొనేముందు... ఒక్కమాట..! - Sakshi

కొనేముందు... ఒక్కమాట..!

 కొత్త సంవత్సరం వచ్చేసింది. మార్కెట్ సూచీలేమో గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. కొన్ని షేర్లు కూడా ఇప్పటికే తారాజువ్వల్లా ఎగసి... అత్యధిక రేట్ల దగ్గర కదులుతున్నాయి. మరోవంక ఆర్థిక పరిస్థితులేమో అంతంతమాత్రంగానే ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రూపాయి క్షీణిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా కూడా పరిణామాలేమీ అంత ఆశాజనకంగా లేవు. వీటన్నిటికీ తోడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలొచ్చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? అనే అంశాలపై ఎవరెన్ని సర్వేలు చేస్తున్నా ఇప్పటికీ ఒక స్పష్టతయితే లేదు. మరి మదుపరులు ఏం చేయాలి? ఏ రంగం బాగుంటుంది? ఒకవేళ బాగుంటే ఎందుకు బాగుంటుంది? ఆ రంగంలో మనం కొనుక్కోదగ్గ షేర్లేమయినా ఉన్నాయా? ఇవన్నీ ఇన్వెస్టర్లను తొలిచేస్తున్న సందేహాలే. అందుకే వీటన్నిటినీ ైరైట్ హొరైజన్స్ సంస్థ సీఈఓ అనిల్ రెగో ముందుంచింది సాక్షి. ఫైనాన్షియల్ ప్లానర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా అయిన రెగో వీటికి ఏం చెప్పారన్నదే ఈ కథనం...
 
 గ్రామీణ ఆటో బాగుంటుంది
 ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. అందుకని గ్రామాల్లో ఆదాయం బాగుంది. అందుకని వారి ఖర్చూ పెరుగుతుంది. మరొకటేమిటంటే ఎన్నికల సంవత్సరంలో డబ్బు లభ్యత పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి కూడా గ్రామాల్లో వినిమయం పెరుగుతుంది. ఈ లెక్కన చూస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ ఏడాది ఆటో మొబైల్ రంగం సానుకూలంగా ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఆటో మొబైల్ కంపెనీ షేర్ల సగటు పీఈ విలువ మార్కెట్ పీఈకి సమానంగా ఉంది. టూ వీలర్స్ అమ్మకాలు బాగుండొచ్చు కనక డే హీరో మోటార్స్‌వైపు చూడొచ్చు. ఈ సానుకూలాంశాలకు తోడు జేఎల్‌ఆర్ పనితీరు మెరుగవుతోంది కనక టాటా మోటార్స్ షేర్లనూ పరిగణనలోకి తీసుకోవచ్చు.
 
 బ్యాంకులు దుమ్ము దులుపుతాయ్!
 ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల షేర్లు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వాటికి మొండి బకాయిలు తక్కువ. చౌకగా డిపాజిట్లను తెచ్చే కాసా నిష్పత్తి ఎక్కువ. వీటన్నిటికీ తోడు ఫీజు ఆదాయాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల షేర్ల విషయానికొస్తే ప్రస్తుతం అవి చాలా చౌకగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల విలువ... వాటి పుస్తక విలువ (బుక్‌వేల్యూ) కంటే 72% తక్కువగా ఉంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నిటినీ కలిపి చూస్తే వాటి విలువ సగటు పుస్తక విలువ కంటే 42% తక్కువగా ఉంది. ఎస్‌బీఐ, బీఓబీలను మినహాయిస్తే మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లన్నీ వాటి పుస్తక విలువ కంటే 45-50% తక్కువ రేటులో ట్రేడ్ అవుతున్నాయి. ఒకసారి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చి, ఆర్థిక వృద్ధి గాడిలో పడితే... అన్నిటికంటే అత్యధికంగా లబ్ధి పొందేవి ప్రభుత్వ రంగ బ్యాంకులే. కాకుంటే వడ్డీరేట్లు తగ్గేదాకా పీఎస్‌యూ బ్యాంకు షేర్లతో జాగ్రత్తగా ఉం డాలి. ఈ సమయంలో ప్రైవేటు బ్యాంకుల కేసి మొగ్గు చూపొచ్చు.
 
 ఎన్‌బీఎఫ్‌సీలకు దూరంగా ఉండండి...
 ఎం అండ్ ఎం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మినహాయించి మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీ షేర్లన్నీ ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒకవైపు ఎన్‌పీఏలు పెరుగుతున్నాయి. మరోవంక గృహరుణాల డిమాండ్ తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ, శ్రేయి ఇన్‌ఫ్రా, ఇండియా బుల్స్ హౌసింగ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ వంటి షేర్లన్నీ వాటి సగటు పుస్తక విలువ కంటే 40 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయిపుడు. అయితే వీటి బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి ఉంది కనక, ఎన్‌పీఏలు పెరుగుతున్నాయి కనక వీటికి దూరంగా ఉండటమే మంచిది. కనీసం ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకైనా...!
 
 క్యాపిటల్ గూడ్స్‌పై ఒత్తిడి
 వాటి చరిత్రాత్మక సగటు విలువతో పోలిస్తే క్యాపిటల్ గూడ్స్ రంగం షేర్లు 45 శాతం తక్కువ ధర వద్దే ఉన్నాయి. కానీ వీటిలో హావెల్స్, ఎల్ అండ్ టీ వంటి కొన్ని షేర్ల పనితీరు ఇంకాస్త బాగుంది. దీనికి కారణం వీటి ఆర్డర్ల బుక్, పనితీరు బాగుండటమే. వడ్డీరేట్లతో ముడిపడి ఉన్న రంగం కావడంతో రేట్లు తగ్గే వరకు ఆగడం మంచిది. మంచి కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగించొచ్చు.
 
 గాడిలో పడుతున్న సిమెంట్
 జేపీ అసోసియేట్స్ సిమెంట్ ప్లాంట్‌ను అల్ట్రాటెక్ కొనడం మంచి పరిణామం. విదేశీ కంపెనీలు దేశీయ సిమెంట్ కంపెనీలపై ఆసక్తి చూపిస్తున్న విషయం దీనిద్వారా బయటపడింది. అందుకే ఈ రంగంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సిమెంట్ డిమాండ్ పెరుగుతుందన్న ఆశ కూడా మరో కారణం. దీంతో వాటి సగటు విలువల కంటే 4% ప్రీమియంతో ఈ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.
 
 ప్రీమియంలో కన్సూమర్ గూడ్స్...
 ఈ రంగంలోని ప్రధాన షేర్లన్నీ ప్రస్తుతం ప్రీమియం ధరల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ 50%, జీసీపీఎల్ 47%, ఐటీసీ 38%, పిడిలైట్ 49% అధిక ధరలలో (సగటు కంటే) ఉన్నాయి. ఈ రం గంపై దూకుడు తగ్గించటమే మంచిది. పెట్టుబడుల్లో వైవిధ్యం చూపించాలంటే ఐటీసీ వంటి నాణ్యమైన షేర్ల కేసి చూడొచ్చు.
 
 ఆరోగ్యానికి అమెరికా ధీమా
 ఆరోగ్య పరిరక్షణ రంగంలోని షేర్లన్నీ వాటి గత సగటుతో పోలిస్తే 22 శాతం అధిక ధరల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, అమెరికా వృద్ధి, పెరుగుతున్న యూఎస్ ఎఫ్‌డీఏల అనుమతులతో ఈ రంగం ఇంకా ఆకర్షణీయంగానే ఉందని చెప్పాలి. సన్ ఫార్మా, దివీస్ ల్యా బ్ షేర్లను ఇంకా కొనచ్చు. తగ్గినప్పుడల్లా అపోలో హాస్పిటల్స్ షేర్లను కొనుగోలు చేయటం మంచిది.
 
 మీడియా మరీ చౌక కాదు
 మీడియా షేర్లన్నీ గత సగటు పీఈ ధరల కంటే కేవలం ఆరు శాతం తక్కువ ధర వద్ద ఉన్నాయి. డిజిటలైజేషన్‌తో అధికంగా లబ్ధిపొందిన ‘‘జీ’’ షేరు ఒక్కటే సగటు కంటే ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతోంది. సినీమ్యాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల పీవీఆర్ పరిస్థితి కూడా బాగుంది. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రకటనలు బాగా పెరిగే అవకాశం ఉంది. విలువ పరంగా చాలా చౌకగా ఉన్నాయి కనక ఈ ఏడాది ప్రింట్ మీడియా షేర్లు బాగుండే అవకాశాలున్నాయి.
 
 రియల్ ఎస్టేట్.. వేచి చూడాల్సిందే...
 గతంలోని సగటుతో పోలిస్తే 63 శాతం చౌకగా లభిస్తున్నప్పటికీ అధిక వడ్డీరేట్లు, డిమాండ్ లేకపోవడం వంటి కారణాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోందనే చెప్పాలి. వడ్డీరేట్లు తగ్గు ముఖం పట్టే వరకు వేచి చూడాల్సిందే.
 
 టెక్నాలజీ... ఇంకా చౌకే..
 గడిచిన ఏడాదిలో ఐటీ రంగం 48% లాభాలు అందించినప్పటికీ వాటి సగటు పీఈ విలువలతో పోలిస్తే ఐటీ షేర్లు ఇంకా చౌకగానే ఉన్నాయి. గతంలోని సగటు విలువ (ప్రైస్ టు బుక్)తో పోలిస్తే  ఇన్ఫోసిస్ 38 శాతం, టెక్ మహీంద్రా 28% డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ ఒక్కటే 6% ప్రీమియం ధరలో ఉంది. యూరప్, అమెరికా వృద్ధి, రూపాయి క్షీణతతో ఈ రంగం లబ్ధి పొందుతోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement