ఆ ఊరిలో.. ఇంటికో టీచర్!
ఆ ఊరిలో.. ఇంటికో టీచర్!
Published Tue, Sep 6 2016 8:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM
బెళగావి: ఉపాధ్యాయ వృత్తి.. అన్ని వృత్తుల కంటే ఎంతో పవిత్రమైనది. ఓ విద్యార్థికి ఉన్నతమైన భావాలు కలిగేలా తీర్చిదిద్దడంలో ఈ వృత్తి పాత్ర అమోఘం. ఆ గొప్ప వృత్తినే తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంది ఓ గ్రామం. ఇంటికో టీచర్తో టీచర్స్ విలేజ్గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ టీచర్స్ విలేజ్ ఎక్కడుందో మనమూ ఓ సారి తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని సావదాతి తాలుకాకు చెందినది ఇంచల్ గ్రామం. ఆ గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మొదటి చాయిస్గా ఉపాధ్యాయ వృత్తినే కోరుకుంటారట. వారి కోరిక మేరకు పిల్లలు కూడా ఉపాధ్యాయ వృత్తినే తమ ఉపాధిగా ఎంచుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం ఆరు వేల జనాభా ఉన్నారు. వీరిలో 600 పైగా మంది టీచర్లే. కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో వీరు టీచర్లుగా పనిచేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ విద్యాలయాల్లో టీచర్లుగా పనిచేస్తుంటే.. మరికొంతమంది ప్రైవేట్ విద్యాలయాల్లో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ ప్రొగ్రామ్ పూర్తిచేసుకున్న యువత కూడా టీచర్ పోస్టింగ్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుందట. టీచర్ ఫ్యామిలీస్లో అతిపెద్ద కుటుంబం షబ్బీర్ మిరాజనవార్ది. వీరు కర్ణాటక స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్కు చెందిన బైహోన్గల్ తాలుక్ సెక్రటరీ. ఇతని కుటుంబంలో 13 మంది టీచర్లుగా కొనసాగుతున్నారు.
ఇంచల్ గ్రామంలో చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారని, రెండో ఆప్షన్గా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని సావదాతి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ఎల్ భజన్త్రీ చెప్పారు. అయితే 1970 వరకు ఇంచల్లో ఒక ప్రైమరీ స్కూల్, ఎనిమిది మంది టీచర్లు మాత్రమే ఉండేవారు. స్టడీస్ను కొనసాగించాలంటే విద్యార్థులు బైహోన్గల్ పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలామంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపివేసేవారు. ఈ సమస్యను సీరియస్గా తీసుకున్న శివానంద్ భారతి స్వామిజీ కొంత మంది టీచర్లతో ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటుచేశారు. గ్రామంలోనే ఉన్నత చదువులు అభ్యసించేలా అవకాశం కల్పించారు. అనంతరం 1984లో రూరల్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయింది. ఆ సెంటర్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ కల్పించారు. అలా ఇంచల్ గ్రామం అక్షరాస్యత శాతాన్ని అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థుల టీచర్స్ ట్రైనింగ్కు సహకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఓ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, పీయూ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బీఏఎమ్ఎస్ కాలేజీ, సంస్కృత విద్యాలయం ఉన్నాయి.
Advertisement