
ఇది ఆరంభం మాత్రమే; ఐసిస్ ప్రకటన
మాంచెస్టర్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నగరంలో విధ్వంసానికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ఐసిస్.. ఇది ఆరంభం మాత్రమేని హెచ్చరించింది. ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామని భీకరవ్యాఖ్యలు చేసింది. మాంచెస్టర్‌లోని మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన ’నెయిల్ బాంబు’ పేలుడులో 19 మంది మరణించగా, 50మంది గాయపడ్డారు. మాంచెస్టర్ పేలుళ్లు విజయవంతం కావడంపట్ల ఐసిస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. ‘మోసుల్‌లో దాడులకు ప్రతీకారమే ఇది..’ అని కామెంట్లు పెట్టారు.
అమెరికన్ పాప్ గాయని అరియానా షో ముగిసిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. ఎరీనా వద్ద బాంబు పేలిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. అక్కడికి సమీపంగా ఉన్న కేథడ్రల్ గార్డెన్‌లోనూ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మాంచెస్టర్ ఘటనతో ఉలిక్కిపడ్డ యూరప్ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. జనం ఎక్కువగా గుమ్మికూడే చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ, అదనపు బలగాలను మోహరించాయి. అటు అమెరికాసైతం సెక్యూరిటీని టైట్ చేసింది.