ప్రేమకు లింగ భేదం లేదు!
న్యూఢిల్లీ: ప్రేమకు హద్దులు, అవధులు లేవని.. చట్టాలు కూడా తమను అడ్డుకోలేవని నగరానికి చెందిన ఇద్దరు హోమోసెక్సువల్స్ నిరూపించారు. ఐపీసీ 377 ప్రకారం భారతదేశంలో హోమో సెక్సువల్స్ కు స్వేచ్ఛగా తిరిగే అనుమతి లేకపోయినా, అది చట్ట ఉల్లంఘన అని తెలిసినా.. వాళ్లిద్దరూ తమ ప్రేమయాత్రను ఫోటో షూట్ ద్వారా చిత్రించి ప్రేమోత్సవాన్ని జరుపుకున్నారు.
ఎవరిని ప్రేమించాలో నిర్ణయించుకునే శక్తి వారికే ఉందని నమ్మే ఫోటో గ్రాఫర్ ఈ జంటకు దొరకడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఢిల్లీకి చెందిన ఫోటో గ్రాఫర్ ప్రియమ్ మల్హోత్రా సాయంతో ఆ జంట తమ ప్రేమానుభూతుల క్షణాలను కెమెరాలో బంధించుకున్నారు. ఈ అద్భుత చిత్రాలను మల్హోత్రా 'లవ్ బియండ్ జండర్' పేరుతో ఫేస్ బుక్ లో ఉంచారు. కాగా, కుటుంబాలకు వదిలేసి.. ప్రేమ కోసం బయటకు వచ్చిన ఓ జంట చిత్రాలను తీయడం ఓ గొప్ప అవకాశమని ఆయన అన్నారు. అయితే వీరి ఫోటోలను తీసేపుడు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు.
ఫోటో షూట్ కు ఒప్పుకున్నప్పుడు ఫోటోల్లో ఉన్న వ్యక్తులెవరో తెలియకుండా, క్రియేటివ్ గా ఫోటోలను తీయాల్సిన పరిస్థితి వచ్చిందట. , ఒక్కసారి ఈ చిత్రాలను చూస్తే ఆ విషయంలో మల్హోత్రా ఎంతలా విజయం సాధించారో అర్ధం అవుతుంది. ఇందుకోసం ఎక్కువగా రంగులు, లైట్లు, నీడలను ఉపయోగించినట్లు మల్హోత్రా తెలిపారు. ఫోటోలను తీసే సమయంలో కపుల్ చాలా కో-ఆపరేటివ్ గా ఉన్నారని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న లెసిబియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జండర్(ఎల్బీజీటీ) కమ్యూనిటీకు మల్హోత్రా పెద్ద సపోర్టర్. కేవలం ఒకే ఒక గంటలో ఫోటో షూట్ ను పూర్తి చేసిన మల్హోత్రా ఎల్జీబీటీ జెండా రంగులన్నింటినీ ఇందుకు ఉపయోగించాడు. దక్షిణ ఢిల్లీలో ఉన్న గ్రాఫిటీని కూడా ఇందుకు వినియోగించుకున్నారు.