ఈసారి 7.5 శాతం వృద్ధి
దేశీయంగా పెరిగే డిమాండ్, వినియోగం తోడ్పాటు
చమురు భారం తగ్గడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
భారత్‌పై యూఎన్‌సీటీఏడీ నివేదిక
న్యూఢిల్లీ:దేశీయంగా డిమాండ్, వినియోగం ఊతం తో ఈ ఏడాది భారత్ 7.5 శాతం వృద్ధి సాధించగలదని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి మండలి (యూఎన్‌సీటీఏడీ) పేర్కొంది. చమురు దిగుమతుల భారం తగ్గడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని ఒక నివేదికలో తెలిపింది. తూర్పు, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల సంయుక్త వృద్ధి రేటు 2015లో 5.5-6 శాతం మధ్యలో ఉండగలదని పేర్కొంది. ఆసియా మళ్లీ గతంలోలాగా అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని, 2015లో ప్రపంచ దేశాల మొత్తం వృద్ధిలో దాదాపు సగం వాటా దక్కించుకోగలదని వివరించింది. ముడిచమురు రేట్ల తగ్గుదలతో భారత్, పాకిస్తాన్ వంటి పలు దేశాల్లో క్యాడ్ భారం తగ్గిందని తెలిపింది. 2007-2015 మధ్య కాలంలో ప్రపంచ ఉత్పత్తి వృద్ధి పట్టికను ప్రస్తావిస్తూ.. భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.5 శాతంగా ఉండగలదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అంచనాలు (8.1-8.5 శాతం).. ఐక్యరాజ్య సమితి అంచనాల కన్నా అధికంగా ఉండటం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ముందుగా 7.6 శాతం వృద్ధి రేటు అంచనా కట్టినా.. ఇటీవలే దాన్ని 7.4 శాతానికి కుదించింది.
డిమాండ్ మెరుగుపర్చుకోవాలి..
భారత్ దేశీయంగా డిమాండ్‌ను పెంచుకోవడంపైనా, ఉద్యోగాల కల్పనపైనా దృష్టి సారించాలని నివేదికను ఆవిష్కరించిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ తెలిపారు. కేవలం సేవా రంగంపైనే ఆధారపడకుండా వ్యవసాయం, తయారీ రంగాలకీ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అటు రేటింగ్ ఏజెన్సీలు వాస్తవ పరిస్థితులను పెద్దగా పట్టించుకోకుండా కేవలం కొన్ని నివేదికల ఆధారంగానే రేటింగ్ ఇస్తుంటాయని ధర్ వ్యాఖ్యానించారు. కాగా చాలా మటుకు ఆసియా దేశాలు.. ప్రధానంగా చైనా తమ దేశాల్లో డిమాండ్ సరళిని సరిచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని యూఎన్‌సీటీఏడీ తెలిపింది.