సెన్సెక్స్ 240 పాయింట్లు డౌన్
ద్రవ్యోల్బణం ఒక వినాశకర వ్యాధి అంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఉధృతిని సృష్టించాయి. ఈ నెల 28న చేపట్టనున్న పరపతి సమీక్షలో వడ్డీ రేట్లపై రామన్ ఎలా స్పందిస్తారో అన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యాపించాయి. వెరసి వడ్డీ ప్రభావిత రంగాలు 3% పతనమయ్యాయి.
వరుసగా రెండు రోజుల కొత్త గరిష్టాలను తాకుతూ వచ్చిన సెన్సెక్స్ వారాంతంలో ఒక్కసారిగా నీరసించింది. ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో 240 పాయింట్లు పతనమై వారం రోజుల కనిష్టమైన 21,133 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో ఇదే భారీ నష్టంకాగా, ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు రియల్టీ, యంత్రపరికరాలు, వినియోగ వస్తువులు, బ్యాంకింగ్ 3-2% మధ్య దిగజారాయి. వీటితోపాటు ఆటో, మెటల్స్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ, పవర్ సూచీలు సైతం 1.5% స్థాయిలో క్షీణించడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 79 పాయింట్లు కోల్పోయి 6,267 వద్ద స్థిరపడింది.
పతనానికి పలు కారణాలు
ఇటీవల ఆహార సరుకుల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలకు 7.2% నుంచి 6.1%కు ఉపశమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో కొంతమేర ఆశలు నెలకొన్నాయని, అయితే రాజన్ వ్యాఖ్యలు వీటిపై నీళ్లు జల్లాయని మార్కెట్ల పతనంపై విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదిచాలదన్నట్లు పరపతి విధానాలకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆర్‌బీఐ నిపుణుల కమిటీ సూచించడం ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని చెప్పారు. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిందని తెలిపారు. మార్కెట్లు ముగిశాక రూపాయి విలువ ఆరు నెలల కనిష్టాన్ని చవిచూడటం గమనార్హం. కాగా, చైనా తయారీ రంగం మందగించడంతో విదేశీ మార్కెట్లు బలహీనంగా మారడం కూడా అమ్మకాలకు కారణమైందని విశ్లేషకులు వివరించారు.
మరిన్ని విశేషాలివీ..
ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్న ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 231 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
పంజాబ్‌లోని తోన్సా ప్లాంట్‌లో తయారయ్యే ఔషధ ఎగుమతులను సైతం యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా నిషేధించడంతో ర్యాన్‌బాక్సీ షేరు ఏకంగా 20% నేలకూలింది.
సెన్సెక్స్ దిగ్గజాల్లో ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్ మాత్రమే నామమాత్ర లాభాలతో నిలదొక్కుకున్నాయి.
బ్లూచిప్స్‌లో భెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, సెసా స్టెరిలైట్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, టాటా పవర్, ఐటీసీ 3.5-1.5% మధ్య తిరోగమించాయి.
చిన్న షేర్లకు ప్రాతినిధ్యంవహించే మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% నష్టాలను చవిచూశాయి.
నీరసించిన సెంటిమెంట్‌ను పట్టిచూపుతూ ట్రేడైన షేర్లలో 1,759 నష్టపోగా, 890 మాత్రమే లాభపడ్డాయి.