ఆసిఫాబాద్: గిరిజన మైనర్ బాలికను బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కాగజ్‌నగర్ డీఎస్పీ ఎండీ హబీబ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన నిందితులు మాచెర్ల రాజు, సయ్యద్ మతీన్, రౌతు రంజిత్ పథకం ప్రకారం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగజ్‌నగర్‌కు చెందిన మల్లేశ్.. తిర్యాణి మండలానికి చెందిన మహిళలను వ్యవసాయ కూలీ పనులకు తన ఆటోలో తీసుకెళ్లేవాడు. అలా వ్యవసాయ కూలీలతో అతనికి పరిచయం ఏర్పడింది. తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన మైనర్ గిరిజన బాలికతోనూ అతను పరిచయం చేసుకున్నాడు. ఐదు నెలల కిందట మల్లేశ్ తన మిత్రుడు వెంకటేశ్‌తో కలిసి ఆసిఫాబాద్‌కు వచ్చాడు. అక్కడ వారు గిరిజన బాలికను కలుసుకొని.. సమీపంలోని చిన్నరాజూర రోడ్డుకు వెళ్లారు.
అదే సమయంలో కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వస్తున్న మాచెర్ల రాజు వారిని గమనించాడు. తన మిత్రులు సయ్యద్ మతీన్, రౌతు రంజిత్‌లతో కలిసి అక్కడికి వెళ్లి.. గిరిజన బాలికతో ఉన్న మల్లేశ్, వెంకటేశ్‌లను బెదిరించారు. వారిపై దాడిచేసి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి విషయం బయటికి చెబితే హతమారుస్తామని బెదిరించారు. 15 రోజుల కిందట ఈ సెల్‌ఫోన్ దృశ్యాలు బయటికి రావడంతో సంఘటన వెలుగుచూసింది. ఈ నెల 9న బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గ్యాంగ్ రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరుపరిచారు.
సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. చంపేస్తామని బెదిరించారు!
Published Wed, Jul 13 2016 10:43 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement