క్షీణించిన టైటాన్ లాభాలు
Published Wed, Aug 3 2016 7:59 PM | Last Updated on Mon, Jul 29 2019 7:32 PM
ముంబై: టాటా గ్రూపునకు చెందిన టైటాన్ కో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదల చేసింది. జ్యువెలరీ, వాచీల దిగ్గజం టైటన్ కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 16.34 శాతం గా క్షీణించి రూ. 127 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2015-16) క్యూ1లో రూ.151.45 కోట్ల నికర లాభం ఆర్జించింది. పసిడి ధరలు పెరగడం, ఉద్యోగులకు వీఆర్‌ఎస్ వంటి కారణాలతో రూ. 97 కోట్లమేర అనూహ్య నష్టాలు వాటిల్లడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంవత్సరం కొన్ని ప్రతికూల అంశాలు దెబ్బతీసినప్పటికీ, బాటం లైన్ పెర్స్పెక్టివ్ లో మొదటి త్రైమాసికం బావుందని టైటాన్ కో మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ చెప్పారు.
అయితే ఆదాయం మాత్రం పుంజుకుంది. నికర అమ్మకాల్లో 7.56 శాతం వృద్ధిని సాధించి రూ. 2,782.5 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 2,586.76 కోట్లుగా ఉంది. జ్యువె ల్లరీ విభాగం ఆదాయం రూ. 2,138.32 కోట్లు కాగా, వాచెస్ విభాగంలో రూ. 491.72 కోట్లు ఆర్జించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 32 శాతం ఎగసి రూ. 292 కోట్లుగా నమోదైంది.
కాగా జీఎస్టీ బిల్లుపై అంచనాలనేపథ్యంలో బుధవారం ఈ షేర్ పతనమైంది. ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్‌ఈలో టైటన్ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 411 దగ్గర ముగిసింది.
Advertisement
Advertisement