రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కరువు నివారణకు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఏదీ లేదని, తక్షణం రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కరువు నివారణకు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఏదీ లేదని, తక్షణం రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని కోరారు. గ త ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వానికి కరువు నివేదిక పంపలేదని, ఈ ఏడాదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కరువును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, కేవలం 14నెలల కాలంలో ఏకంగా 1150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆ లేఖలో ప్రస్తావించారు. దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే మొదటి స్థానం వచ్చిన ఆశ్చర్యం లేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కరువు నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణను వెంటనే రూపొందించాలని కోరారు.