అత్యాచారాలు..అఘాయిత్యాలు
కొందమాల్ జిల్లాలో ఆదివాసీ బాలికల పరిస్థితి దయనీయంగా ఉంది.. కౌమార దశలో శారీరక మార్పుల గురించి ఆదివాసీ బాలిలకు అవ గాహన లేకపోవడాన్ని కామాంధులు అవకాశంగా తీసుకుంటున్నారు.. ఏం జరిగిందో తెలుసుకునేలోగా బాలికలు గర్భం దాలుస్తున్నారు.. ఆడుకునే వయసులోనే తల్లులు కావడంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదివాసీ బాలికలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నవారిలో ధనమదాంధులు, అధికారులు ఉన్నారు.
బరంపురం : కొందమాల్ జిల్లాలోని పలు కన్యాశ్రమాల్లో పద్నాలుగేళ్ల బాలికలు గర్భవతులు కావడం రాష్ట్రంలో కలకలం రేపింది. బాధితుల్లో కొందరు యువతులపై లైంగిక దాడి జరిగింది. కానీ ఏం జరిగిందో, ఎవరు లైంగిక దాడికి పాల్పడ్డారో చెప్పలేని స్థితిలో బాలికలు ఉన్నారు. లైంగిక దాడి ఫలితంగా తాము గర్భం దాల్చిన విషయం కూడా తెలియకపోవడంతో బాలికలు అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే గర్భవతులైన బాలికలు మృతి చెందుతున్నారు.
అండగా ఉండని పాలకులు
ఆదివాసీల అమాయకత్వమే బాలికల పాలిట శాపమైంది. లైంగిక దాడికి గురైన బాలికల్లో ఎక్కువ మంది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల బాధిత గిరిజనులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్రహింసల పాల్జేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దాడులకు పాల్పడే కామాంధులకు, రాజకీయ నాయకులకు అటవీ, పోలీసు అధికారులు మద్దతుగా నిలుస్తున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
సీఆర్పీఎఫ్ జవాన్లూ...
ఆదివాసీ గ్రామాల్లో యువతులు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారని తెలియడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల కిందట దరింగబడి బ్లాక్‌పరిధిలోని సిమన్‌బడి ఆదివాసీ గ్రామంలో ముగ్గురు యువతులపై సీఆర్పీఎఫ్ జవాన్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొందమాల్ జిల్లా రైకియా బ్లాక్ పరిధిలోని దాసింగబడి గ్రామ ఆదివాసీ బాలికపై సీఆర్పీఎఫ్ జవాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు జవానును హత్య చేసినట్లు తెలిసింది. ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఈ ఘటనను అధికారులు కప్పిపుచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.
అవగాహన పెరగాలి
దేశంలో శిశు మరణాల్లో కొందమాల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. కౌమార దశలో వచ్చే శారీరక మార్పులపై బాలికలకు అవగాహన ఉండకపోవడం కారణమని అధికారులు పేర్కొన్నారు. దీంతో వారికి అవగాహన కల్పించాల్సి ఉంది. కౌమార దశలో వచ్చే శారీరక మార్పులపై వివరించేందుకు గిరిజన గూడలకు ఆరోగ్య కల్యాణి సమితి, అంగన్‌వాడీ కార్యకర్తలు వెళుతున్నారని జిల్లా ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. గిరిజన గూడలకు వారు వెళ్లినపుడు ఆదివాసీ మహిళలు పనులకు వెళ్లిపోతున్నారని తెలిపారు.
ఆదివాసీ బాలికల రక్షణకు చర్యలు
ఆదివాసీల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం పలు చట్టాలు రూపొందించింది. బిజూ కొందమాల్ జిల్లా పథకం పేరుతో ప్రత్యేక పథకాన్ని కొందమాల్ జిల్లాలో అమలు చేస్తోంది. ఆదివాసీ బాలికల కోసం ప్రత్యేక కన్యాశ్రమాలు ఏర్పాటు చేశాం. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా కొన్ని చోట్ల ఆదివాసీ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న మాట వాస్తవం. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి కొందమాల్ జిల్లాలో బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
-ఉషారాణి, రాష్ట్ర మహిళా మరియు
శిశు సంక్షేమ శాఖ మంత్రి
ఎవరూ పట్టించుకోవడం లేదు
దరింగబడి సమితి సిమన్‌బడి ఆదివాసీ గ్రామ ంలో మౌలిక సౌకర్యాలు లేవు. తాగేందుకు నీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఆదివాసీ బాలికలపై లైంగికదాడులను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. -సైరమా మల్లిక్, సిమన్‌బడి గ్రామం
ఆందోళన చేసినా స్పందించడం లేదు
కొందమాల్ జిల్లాలో యుక్తవయసకు వచ్చిన ఆదివాసీ బాలిక లు లైంగికదాడులకు గురవుతున్నారు. బాధిత బాలికలకు రక్షణ కల్పి ంచాలని, దోషులను శిక్షణించాలని కోరుతూ దక్షణాంచల్ ఆరీ ్డసీ, కలెక్టర్ కార్యాలయాల వద్ద పలుమార్లు ఆందోళన చేశాం. యుక్తవయసులో వచ్చే మార్పులపై ఆదివాసీ బాలికలకు వివరించేందుకు అవ గాహన శిబిరాలు ఏర్పా టు చేయాలని కోరాం. కానీ పాలకులు, అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణం. - ప్రమీలాదేవి త్రిపాఠి, అధ్యక్షురాలు, మహిళా కల్యాణ సమితి