ఆదివాసీ బాలికలపై అకృత్యాలు.. | Molestation on Tribal Girls in Berhampur Odisha | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన

Published Sat, Jan 26 2019 7:48 AM | Last Updated on Sat, Jan 26 2019 1:35 PM

Molestation on Tribal Girls in Berhampur Odisha - Sakshi

గజల్‌బడి ఆదివాసీ గ్రామంలో అభం శుభం తెలియని ఆదివాసీ బాలిక

వారంతా కల్లాకపటం తెలియని వారు. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు కలిగి,  వాతావరణ కాలుష్యం లేని నివాసం వారిది. రేయనక..పగలనక.. రాయనక..రప్పనక.. కొండకోనల్లో క్రూరమృగాల మధ్య సంచరిస్తూ జీవనయానం సాగిస్తారు. అడవుల్లో క్రూరమృగాల బారి నుంచి వారిని వారు  ఎలాగోలా రక్షించుకోగలుగుతున్నారు. కానీ జనారణ్యంలో మాత్రం మనుషుల ముసుగు వేసుకున్న మృగాళ్ల అకృత్యాలను  ఎదుర్కోలేక  మగ్గిపోతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని పాలకులు ప్రగల్భాలు పలకడం మాని..ఆదివాసీ ప్రాంతాల్లో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వంచన, అకృత్యాలను గమనించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి.

ఒడిశా, బరంపురం: రాజ్యాలు అంతరించాయి. రాజుల పాలన కాలం పోయింది.  ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజా పత్రినిధులే పాలకులు అవుతున్నారు. భారత రాజ్యంగంలో గిరి పుత్రుల రక్షణ, హక్కుల కోసం ఎన్నో చట్ట సవరణలు జరిగాయి. కానీ ఆదివాసీల బతుకులు మాత్రం అంధకారంలోనే ఉన్నట్లు  స్పష్టంగా తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొందమాల్‌ జిల్లాలో అదివాసీ  బాలికలపై జరుగుతున్న అకృత్యాలే ఇందుకు సాక్ష్యాలు నిలుస్తున్నాయి. చట్టాలు చేయడంతోనే సరికాదు. వాటిని పటిష్టంగా అమలు చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఒకటుంది. అది పటిష్టంగా అమలు జరగడం లేదనడానికి కొందమాల్‌ జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని పలు ఎసీ, ఎస్టీ సంఘాలు అరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని కొందమాల్‌ జిల్లాలో రోజు రోజుకు కామాంధుల అకృత్యాల వల్ల అడవి బిడ్డలైన ఆదివాసీ బాలికలు  వంచన, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు బలవుతున్నారు. 

ఈ సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వ అధికారులు, బాలాశ్రమ పాఠశాల యాజమన్యాల దురహంకార కామాంధుల చర్యలకు అభం శుభం తెలియని అమాయక అదివాసీ బాలికలు గర్భవతులై బలవుతున్న సంఘటనలు కొందమాల్‌ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు గడిచిన వారం రోజుల్లో జిల్లాలో గల దరింగబడి పోలీస్‌స్టేషన్‌ పరిధి కిరుబడి ఆదివాసీ బాలికల ఆశ్రమంలో బాలిక గర్భం దాల్చి అపై ఆశ్రమంలో ప్రసవించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా అక్కడికి వారం రోజుల్లో జిల్లాలోని జి.ఉదయగిరిలో గల ఆదివాసీ బాలా శ్రమంలో 10వ తరగతి చదువుతున్న ఆదివాసీ బాలిక గర్భం దాల్చి  జి.ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. మెరుగైన చికిత్స కోసం ఆ బాలికను పుల్బణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో బాలిక ప్రసవించిన శిశువు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశం.

రైకియాలో పిల్లలను ఎత్తుకున్న  ఆదివాసీ యువతులు
అవయవ మార్పులపై అవగాహన లేని ఆదివాసీలు
రాష్ట్రంలో నూటికి 98 శాతం మంది ఆదివాసీలు నివసించేది కొందమాల్‌ జిల్లాలోనే. ‘కొందొ’ అనగా ‘ఆదివాసీలు’ మాలొఅనగా ‘ఆరణ్యం’. కొందమాల్‌ అంటే  ‘ఆదివాసీల ఆరణ్యం’ అని అర్థం. కొందమాల్‌ జిల్లాలో నూటికి 98 శాతం నివసించే  ఆదివాసీ ప్రజల సంతానమైన బాలికలకు యుక్త వయసు వస్తున్న సమయంలో వారి శరీరంలో వస్తున్న అవయవాల మార్పులపై అందోళన చేందుతున్నట్లు అటవీ పరిశోధక నిపుణులు తెలియజేస్తున్నరు. ఈ శరీర మార్పులపై వారి తల్లులకు కూడా ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారి మనసులో మరింత అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.   ఆదివాసీ బాలికలు యుక్త వయసులో అడుగు పెడుతున్న సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులపై పిల్లలకు సరైన రీతిలో గైడ్‌ చేయవలసిన వారి తల్లులకే అవగాహన లేక పోవడం వల్ల ఆదివాసీ బాలికలు యుక్త వయసు వస్తున్న సమయంలో శరీరంలో వస్తున్న మార్పులతో క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారు.

అదివాసీ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అదివాసీ బాలాశ్రమ పాఠశాలల్లో వందలాది మంది అదివాసీ బాలికలు చదువులు సాగిస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న బాలికలకు యుక్త వయసులో వస్తున్న శరీర మార్పులపై అవగాహన లేక పోవడంతో ఇదే అదునుగా  ని అమాయక ఆదివాసీ బాలికలకు మాయమాటలు చెప్పి కామాంధులు వారి పబ్బం గడుపుకుంటున్నారు. కొంతమంది లైంగిక వేధింపులకు గురైతే మరి కొంతమంది వంచనకు బలి అవుతున్నారు. ఆదివాసీ బాలికలపై అటవికంగా కృరమృగాల్లా అధికారులు, ధనవంతులు పడి వారిని దోచుకుంటున్నారు. కొంత మంది ఆదివాసీ  బాలికలు వంచన, లైంగికదాడులకు బలైనా కూడా అసలు  ఏం జరిగిందో అవగాహన లేకపోవడం, కడుపులో పెరుగుతున్న గర్భాన్ని కూడా తెలుసుకోలేని దీనస్థితిలో గర్భవతులై బిడ్డలకు జన్మనిచ్చి మాతృమూర్తులవుతున్నారు.

కామాంధుల దాహానికి  బలైన కొంతమంది బాధిత ఆదివాసీలు తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేసినా  తిరిగి గిరిజనులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలు పెడుతున్నట్లు  బాధితులు అరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు కామాంధులకు కొమ్ముకాస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు పలు గిరిజన, ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. బయటకు వెలుగు చూస్తున్న సంఘటనలు కొన్ని అయితే బయటకు రానివి పదుల సంఖ్యలో ఉన్నట్లు కొందమాల్‌ జిల్లా కుయి సమాజ్‌ అధ్యక్షుడు లంబోదర్‌ కార్‌ తెలియజేస్తున్నారు.
పోలీస్‌ అధికారులు, అటవీ శాఖ అధికారులు  ధనవంతుల ఒత్తిళ్లు, వంచన, సీఅర్‌పీఎఫ్‌ జవాన్‌ల వేధింపులు భరించలేక అన్యాయం, అక్రమం, వేధింపులను ఎదిరించే శక్తి లేక ఆదివాసీ యువతీ యువకులు ఉద్యమ బాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. 

కొందమాల్‌ జిల్లాలో శిశు మరణాలు
దేశంలో శిశు మరణాల్లో కొందమాల్‌ జిల్లా మొదటి స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ పరిశోధనలో రుజువైనట్లు తెలుస్తోంది. కొందమాల్‌ జిల్లాలో నివిసించే ఆదివాసీ బాలికలు యుక్త వయసు వచ్చే సమయంలో శరీరంలో వచ్చే మార్పులపై ఎటువంటి అవగాహన లేక పోవడమే ఇందుకు కారణమని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.

చైతన్య శిబిరాలు అవసరం
జిల్లా పాలనయంత్రంగం ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ బాలికలకు యుక్త వయసులో వచ్చే శరీర మార్పులపై శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే విధంగా  చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  అదివాసీలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, దీని ఫలితంగా కొందమాల్‌ జిల్లాలో అదివాసీ బాలికలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టవచ్చని అలాగే ఉద్యమ బాటలో పయనిస్తున్న ఆదివాసీ యువతీ, యువకులను నియంత్రించ గలమని కుయి సమాజం అద్యక్షుడు లంబోదర్‌ నాయక్‌ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement