న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పనితీరు ప్రజానుకూలంగా లేకుంటే తృణమూల్ కాంగ్రెస్ నిలదీస్తుందని పార్టీ శ్రేణులతో అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌కు లోక్‌సభలో 34 మంది ఎంపీలు ఉన్నారని, ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలిస్తామని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే నిలదీస్తామని ఆమె చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. తాము నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తామని, వ్యతిరేకంగా ఉండబోమన్నారు. తాము సీపీఎంలా కాదని ఆమె పార్టీ అంతర్గత సమావేశంలో అన్నట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో మోడీ, మమత మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
మోడీ ప్రమాణ స్వీకారానికి ఆమె వెళ్లకుండా పార్టీ నేతలు ముకుల్‌రాయ్, రాష్ట్రమంత్రి అమిత్ మిత్రాను పంపారు. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడడానికి కేంద్ర సర్కారు సాయాన్ని మమత ఆశిస్తున్నారు. రుణాలు తిరిగి చెల్లించడంపై మారటోరియం విధించాలని ఆమె గతంలో కోరినా యూపీఏ సర్కారు నుంచి స్పందన కరువయ్యింది.