మూడు రోజుల్లో వెనక్కి తీసుకోండి
నోట్ల రద్దుపై మమత, కేజ్రీవాల్ అల్టిమేటం
న్యూఢిల్లీ/ఆజంగఢ్: నోట్ల రద్దు నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఢిల్లీ వీధుల్లో గురువారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, మూడ్రోజుల్లో నిర్ణయం ఉపసంహరించుకోకపోతే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. నగదు లభ్యత వివరాలు చెప్పాలంటూ పార్లమెంట్ వీధిలోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.
అంతకుముందు ఆజాద్‌పూర్ హోల్‌సేల్ పండ్లు, కూరగాయాల మార్కెట్ వద్ద వర్తకుల్ని ఉద్దేశించి మమత, కేజ్రీవాల్‌లు ప్రసంగించారు. స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఈ పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా దేశాన్ని నడపకూడదని, మొదట విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకురావాలని మమత కోరారు.
‘తన పారిశ్రామిక స్నేహితులు తీసుకున్న రూ. 8 లక్షల కోట్ల రుణం మాఫీ చేసేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 10 లక్షల కోట్లు సేకరించి ఆ మొత్తంతో రుణాలు మాఫీ చేస్తారు. కొందరు వ్యక్తుల ఇంటికి వెళ్లి నోట్ల కట్టలు ఇస్తున్నారు. మూడు రోజుల్లో నిర్ణయం ఉపసంహరించుకోపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’ అని కేజ్రీవాల్ హెచ్చరించారు. అరుణ్‌జైట్లీ తన కుమార్తె వివాహానికి రూ. 2.5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారా? క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోరుున 40 మంది మృతికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని కేజ్రీవాల్ ఆగ్రహంగా ప్రశ్నించారు.
దేశం వందేళ్ల వెనక్కి: మమత
ప్రజలు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవాలన్న వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మమత... దేశంలో కేవలం 4 శాతం మాత్రమే ప్లాస్టిక్ డబ్బును వినియోగిస్తున్నారని చెప్పారు. ‘ప్రజల కోసం నా పోరాటం కొనసాగిస్తా. నేను భయపడను. మీకు ధైర్యముంటే నన్ను జైల్లో పెట్టండి, కాల్చండి’ అంటూ సవాలు విసిరారు. ప్రధాని నిర్ణయంతో దేశం 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిందని, ప్రభుత్వం రోజుకో నిర్ణయం ప్రకటిస్తోందంటూ విమర్శించారు. ఆజాద్‌పూర్ మార్కెట్ నుంచి ఆర్‌బీఐ కార్యాలయం వరకూ మమత, కేజ్రీవాల్‌లు ర్యాలీ తీశారు. ఆర్‌బీఐ వద్ద ఎంత నగదు అందుబాటులో ఉందని అధికారుల్ని నిలదీశారు. అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ... ‘ఎంత నగదు అవసరముంది? ఎంత ముద్రించారు? ముద్రణ సామర్థ్యమెంత? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది’ అని ఆర్‌బీఐని ప్రశ్నించామని చెప్పారు.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారు: అమిత్ షా
బీజేపీ నేతలు నోట్ల రద్దుతో ఎలాంటి ఆందోళన చెందడం లేదని, నల్లధనం ఉన్నవారే ఆందోళన చెందుతున్నారంటూ యూపీలోని ఆజంగఢ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ప్రతిపక్ష నేతలు నిజాయతీపరులైతే ఎందుకు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నించారు.