నేల విడిచి సాములేల! | narendra modi and mamata banerjee fire on each other | Sakshi
Sakshi News home page

నేల విడిచి సాములేల!

Published Sun, Apr 10 2016 3:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నేల విడిచి సాములేల! - Sakshi

నేల విడిచి సాములేల!

త్రికాలమ్
జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కానీ, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కానీ మాట్లాడే తీరు చూసినవారిని ఆశ్చర్యం, ఆగ్రహం ఏకకాలంలో ఆవహిస్తాయి. దేశం సుభిక్షంగా ఉన్నట్టూ, అద్భుతమైన ప్రగతి జరుగుతున్నట్టూ, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నట్టూ ప్రధాని మాట్లాడుతుంటే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుక్రవారంనాడు ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణంతో ఆనందించి తమ పరిపాలన జనరంజకంగా ఉన్నట్టు భావిస్తు న్నారు. బంగారు భవిష్యత్తు కావాలంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కే ఓటు వేయాలంటూ ఎన్నికల సభలో అసోం ప్రజలకు నరేంద్రమోదీ ఉద్బో ధించారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్-టీఎంసీలో- టీ అంటే  టై (ఉగ్రవాదం), ఎం అంటే మౌత్(మృత్యువు), సీ అంటే  కరప్షన్ (లంచ గొండి తనం) అంటూ మోదీ అభివర్ణిస్తే బీజేపీని భయానక్ జలీ పార్టీ (డెంజరస్లీ ఫ్రాడ్ పార్టీ-ప్రమాదకరమైన మోసకారి పార్టీ) అంటూ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ బదులిచ్చారు. వీరిద్దరి ప్రసంగాలనూ పరిశీలించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించి సీడీలను తెప్పించుకుంటున్నది.

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో సైతం వాస్తవ పరిస్థితుల గురించీ, ప్రజల జీవన స్థితిగతుల గురించీ చర్చించకుండా నోటికొచ్చిన నిందారోపణలు చేయడం, వాటికి దీటుగా సమాధానాలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుగైదు సంవత్సరాల తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకునే అవసరమే ఉండదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటిం చారు. ఇసుకపైన ఆంక్షలు ఎత్తివేస్తున్నామనీ, ప్రజలు ఇసుక ఉచితంగా తీసుకొని ఇళ్ళు కట్టు కోవచ్చునంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ముఖ్యనేతల మాటలు వినినవారికి  కరువుతో ప్రజలు అలమటిస్తున్నదీ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నదీ ఈ దేశంలోనేనా అనే అనుమానం కలుగుతుంది. బంగారం కుదువపెట్టి పశుగ్రాసం కొంటున్న రైతులూ, నీళ్ళ ట్యాంకర్ల దగ్గర పోలీసు పహారా ఏర్పాటు చేసిన ప్రభుత్వాలూ ఉన్న దేశంలో ప్రధానమంత్రి కానీ ముఖ్య మంత్రులు కానీ కరువు గురించి అంతగా పట్టించుకున్నట్టు కనిపించకపోవడం ఆగ్రహం కలిగించడం సహజం.

మరాఠ్వాడా విలవిల
మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో మూడు సంవత్సరాలుగా వరుస కరువు కాటేస్తుంటే ప్రజలు విలవిలలాడుతున్నారు. 1971-72 నాటి కరువు తర్వాత అంతటి తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి (నరేగా) మాతృక (మహారాష్ట్ర ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్) 1977లోనే రూపొందింది. మూడు సంవత్సరాల వరుస దుర్భిక్షం కారణంగా బోర్లు వేసినా నీరు లేదు. ముఖ్యంగా లాటూరు పట్టణానికి డొంగార్గాం డ్యామ్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు రవాణా చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. రైతులు దాడులు చేయకుండా ట్యాంకర్లను రక్షించేందుకు ప్రభుత్వం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. లాటూరులో నీరు సరఫరా చేసే ప్రాంతాలలో జనం పోట్లాడుకోకుండా నివారించేందుకు 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.

వానలు పడనప్పుడు, భూగర్భ జలాలు అడుగంటినప్పుడు ఏమి చేయాలో పాలుపోని ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ఒక్క లాటూరు జిల్లాలోనే 2015లో 106 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంవత్సరం గడిచిన మూడు మాసాలలో 34 మంది ప్రాణాలు తీసుకున్నారు. దిగులుగా కనిపించిన రైతులలో ధైర్య నింపడానికి ‘బేర్‌ఫుట్ సైకాలజిస్టులు’ (మానసిక శాస్త్రవేత్తలు) వెలిశారు. ప్రతి రైతునూ కలసి ఆత్మవిశ్వాసం కలిగించేందుకు విశ్వవిద్యాలయాల అధ్యాప కులూ, విద్యార్థులూ గ్రామాలలో పర్యటిస్తున్నారు.  ఔరంగాబాద్‌లోని శ్రీరా మానంద తీర్థ సంశోధన్ సంస్థాన్ రైతు ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసి నివారణోపాయాలను సూచించే పనిలో మునిగి ఉంది. ప్రభుత్వం, పౌరసమాజం కొంతమేరకు స్పందిస్తున్న సూచనలు మరాఠ్వాడాలో కనిపిస్తున్నాయి.

భారీ ప్రాజెక్టులపై కసరత్తు
తెలంగాణలో సైతం రైతుల ఆత్మహత్యలు నివారించడం ఎట్లాగో అంతుపట్టని ప్రభుత్వం వాటి గురించి మాట్లాడకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని చెబుతోంది. ప్రాణహిత సహితంగా అనేక ప్రాజెక్టుల ఆకృతిని మార్చే ప్రయత్నంలో ఉన్నది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించవలసిన ఈ  ప్రాజెక్టులలో ఎన్ని, ఎంతకాలానికి  పూర్తవుతాయో తెలియదు. కరువు బాధిత ప్రాంతాలలోని ప్రజలను తక్షణం ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ  కర్తవ్యం. నిజానికి ప్రభుత్వం యావత్తూ ఈ పనిపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించాలి. తెలం గాణలో మొత్తం 438 గ్రామీణ మండలాలు ఉంటే వాటిలో 231ని కరువు మండలాలుగా ప్రకటించారు. ఇదివరకు ఉపాధి హామీ పథకం నిధులను కేంద్రం నేరుగా గ్రామీణాభివృద్ధి శాఖకు ఇచ్చేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు అందజేస్తున్నది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగితే పని చేసినవారికి కూలీ వెంటనే అందదు.

కూలీ అందకపోతే పని చేయడానికి పేదలు ఉత్సాహం చూపించరు. ఈ కారణంగా పని చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది. కరువు సాయంగా రూ. 2,500 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థిస్తే కేంద్రం రూ. 712 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. కరువు మండలాలలో  మంచినీటి సదుపాయం కల్పించడం కోసం రెండు మాసాల కిందట రూ. 56 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇటీవలే కరువు కాలంలో చేపట్టవలసిన పనుల కోసం రూ. 328కోట్లు ఇచ్చింది. కరువు రక్కసి కోరల నుంచి ప్రజలను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు సంపూర్ణంగా తీసుకుంటున్న దాఖలా లేదు. పరిస్థితి తీవ్రతను ఉన్నత స్థాయిలోని వ్యక్తులు గుర్తించకపోతే దిగువ స్థాయి అధికార యంత్రాంగం పట్టించుకోదు. తెలంగాణలో ఉపాధి పథకం కింద పనులు చేసినవారికి ఆలస్యం గానైనా అందవలసిన మొత్తం అందుతోంది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద వేతనాలను ఈ సంవత్సరం 20 శాతం పెంచారు.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేంద్రం నిర్దేశించిన వేతనం కాకుండా చేసిన పనిని కొలిచి అందుకు తగ్గట్టు కూలీ చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇంతవరకూ రూ. 3,073 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి పదిశాతం జోడించాలి. ఈ మొత్తంలో రూ. 1,736 కోట్లు సామగ్రి కోసం ఖర్చు చేశారు. తక్కిన నిధులు నీరు-చెట్టు వంటి కార్యక్రమం కింద, చెరువులకు పూడిక తీసే పని కింద, ఇతర పనుల కింద  ఖర్చు చేసినట్టు రాష్ట్ర  ప్రభుత్వం చెబుతున్నది. ఉపాధి పథకం కింద రోజు వేతనం రూ. 180లు కాగా ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పనిని బట్టి రూ. 127లు ఇస్తున్నారు. సుమారు 83.5 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 359 కరువు మండలాలు ఉన్నాయి.  రూ. 2,449 కోట్లు సహాయం చేయవలసిం దిగా  రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా కేంద్రం మంజూరు చేసిన మొత్తం కేవలం రూ. 433 కోట్లు. ఇందులో ఇప్పటి వరకూ విడుదల చేసింది రూ. 140 కోట్లు. 2015 ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం రూ. 730 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వవలసి ఉండగా పైసా ఇచ్చినట్టు లేదు.

నిజాయితీ కరువు
నిధులు మంజూరు చేయడంలో, ఖర్చు చేయడంలో ప్రభుత్వాలకు పరిమితులు ఉండవచ్చు. కానీ కరువుతో తల్లడిల్లుతున్న రైతును ఆదుకోవడానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయనే స్పృహ రైతులో ఆత్మవిశ్వాసం పెంచు తుంది. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. నేటి ప్రభుత్వాలే కాదు మునుపటి ప్రభుత్వాలు సైతం రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు పటి ష్ఠమైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదు. స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాలన్న ఆలోచన లేదు. అది సాధ్యం కాదనుకుంటే ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించే తాపత్రయం లేదు.

ఇప్పటికీ జనాభాలో అరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యవసాయంపైనా, అనుబంధ వృత్తులపైనా ఆధారపడినవారే. వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసం గం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని ఇటీవల కొన్ని సమావే శాలలో మాట్లాడారు కానీ నిర్దిష్టమైన, సమగ్రమైన కార్యక్రమం ఏదీ రూపొందిం చలేదు.  రైతుల కోసం ప్రధాని ప్రకటించిన బీమా పథకాలు వారి జీవితాలలో వెలుగు నింపడానికి సరిపడవు. జలవనరుల అభివృద్ధి కోసం, వాననీటిని నిల్వ చేయడం కోసం, వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక బృహత్ ప్రయత్నం జరగవలసిన అవసరం ఉన్నది.

కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ కూడ దీసుకొని కరువు సమయాలలో ప్రజలను ఆదుకోవడానికి కొత్త ప్రణాళిక (మాన్యువల్) తయారుచేయాలి. రైతుల ఆత్మహత్యలను నివారించడానికీ, వ్యవసాయాన్ని నష్టాల ఊబి నుంచి బయట పడవేయడానికీ తీసుకోవలసిన చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించాలి.  రైతుల కష్టాలు చూసి చలించిపోయి ఉద్యమిస్తున్నవారికి కానీ అధికారంలో ఉన్న వారికి కానీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి స్పష్టమైన అవగాహన లేదు. పంట రుణాలను తేలికగా చెల్లించగల కిస్తీలలో వసూలు చేయడం, వ్యవసాయ పెట్టుబడులలో సబ్సిడీ ఇవ్వడం, పశుగ్రాసం సరఫరా చేయడం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వంటి చర్యలు కొంత ఉపశమనం కలిగించవచ్చునేమో కానీ సమస్యలను సమూలంగా పరిష్కరించ జాలవు.

ఇందుకోసం రైతు నాయకులూ, రాజకీయ నాయకులూ, వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్తలూ, పౌరసమాజ ప్రతినిధులూ సమష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకోవలసిన అగత్యం ఉన్నది. ఈ సమస్యను సాకల్యంగా అర్థం చేసుకున్న పాలకులు ఎవ్వరూ ఊకదంపుడు మాటలు పలకలేరు. అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేయరు. క్షేత్రవాస్తవికతను విస్మరించి పలాయనవాదాన్ని ఆశ్రయించరు. ప్రజలను వేధిస్తున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిజాయితీగా, శక్తివంచన లేకుండా కృషి చేసేవారే ప్రజానాయకులు. ఇందుకు భిన్నంగా వ్యవహరించడం, వాస్తవాలను పట్టించుకోకుండా స్వప్నజగత్తులో విహరించడం సబబుకాదని తెలుసుకోవాలి.
 


 కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement