యూ డోంట్ వర్రీ.. కేసీఆర్‌కు సోనియా భరోసా!
భేటీలో కేటీఆర్, అహ్మద్‌పటేల్, దిగ్విజయ్
అన్ని ఒప్పందాలూ కుదిరినట్లేనంటున్న టీఆర్‌ఎస్ నేతలు
ఇక విలీనమే తరువాయని వెల్లడి
రాజ్యసభలో టీ-బిల్లు ఆమోదం తర్వాత కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం
(న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘తెలంగాణ విషయం నేను చూసుకుంటాను.. మీ ప్రయోజనాలను కూడా కాపాడతాను. మీరేం ఆందోళన చెందవద్దు (ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో విల్ ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. యూ డోంట్ వర్రీ)’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు హామీ ఇచ్చినట్లు కేసీఆర్‌కు సన్నిహితులైన టీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. కేసీఆర్ తన తనయుడు కె.తారకరామారావుతో సహా సోమవారం సాయంత్రం ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు. కేటీఆర్ స్వయంగా కారునడపగా వారిద్దరూ సాయంత్రం 5.15 గంటలకు జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో.. సీడబ్ల్యూసీ సభ్యుడు అహ్మద్‌పటేల్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. సోనియాగాంధీ వద్దకు వెళ్లగానే కేసీఆర్ గౌరవంతో సోనియాకు పాదాభివందనం చేసినట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనేది పూర్తిగా తెలియరాలేదు. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోనియాతో కేసీఆర్ భేటీ కావడం అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు టీఆర్‌ఎస్‌లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేసీఆర్‌తో సోమవారం సమావేశం అవుతారనే విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే ప్రచురించడం గమనార్హం.
ఏం చేయటానికైనా సిద్ధమని..!
సోనియాగాంధీని కలిసి వచ్చిన తర్వాత కేసీఆర్ చాలా సంతృప్తిగా కనిపించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ‘మన విషయాల్లో మేడం చాలా పాజిటివ్‌గా ఉన్నారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో బిల్లు పెట్టిన తర్వాత కొన్ని సమస్యలను సృష్టించడానికి జరుగుతున్న కుట్రలను మేడంకు వివరించాను. తెలంగాణ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందిన తర్వాత పార్టీ విలీనంతో సహా ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పిన’ అని కేసీఆర్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది. కేసీఆర్ వివరించిన విషయాలన్నీ సావధానంగా విన్న తర్వాత సోనియా అన్ని విషయాలూ తాను చూసుకుంటానని, ఆందోళన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారని కూడా కేసీఆర్ వెల్లడించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.
సోనియాతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో రాజకీయ అంశాలపై పూర్తిగా స్పష్టత వచ్చిందని, ఇక కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై ప్రకటన మాత్రమే మిగిలి ఉందని వారు పేర్కొన్నారు. అయితే రాజ్యసభ, లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకముందు ఇలాంటి రాజకీయ అంశాలపై బయటకు మాట్లాడితే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు విఘాతం కలుగుతుందని టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు మద్దతు ఇస్తున్న బీజేపీతో సహా ఇతర పక్షాలు నిరాసక్తత చూపే అవకాశాలుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి పదవిని టీఆర్‌ఎస్‌కు ఇవ్వటంతో పాటు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు ఇవ్వటం, ఇతర వనరులు అందించటం వంటి అన్ని అంశాలపై ఒక అవగాహన వచ్చింది. నిర్దుష్టమైన ప్రతిపాదనలపై పరస్పర ఒప్పందాలు దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్ స్థాయిలో పూర్తయినట్లే. దీనిపై నేడో, రేపో ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయొచ్చు’అని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు.
వివిధ పార్టీల ఎంపీలతో టీఆర్‌ఎస్ నేతల భేటీ
టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ సోమవారం జేడీయూ అధినేత శరద్‌యాదవ్, తృణమూల్ ఎంపీ ముకుల్‌రాయ్, బిజూ జనతాదళ్ ఎంపీలు డాక్టర్ ప్రసన్న, మెహతాబ్‌లతో సమావేశమయ్యారు. పోలవరం ముంపు గ్రామాలు, హైదరాబాద్ రాజధాని వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. బీజేపీ నేత మురళీమనోహర్ జోషితో ఫోనులోనూ మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీని కలవటానికి టీఆర్‌ఎస్ నేతలు కోల్‌కతా వెళ్లనున్నారు.