సైగ చేసి మరీ.. ట్రంప్ బిత్తిరి చర్య!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన బిత్తిరి వేషాన్ని బయటపెట్టుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల ఆయన విచిత్రంగా ప్రవర్తించారు. తన గదిలో విలేకరులతోపాటు కూర్చున్న ఆమెను సైగ చేసి పిలుచుకొని మరీ.. ‘నీ నవ్వు బాగుంది’ అంటూ అందరిముందు కితాబిచ్చారు. ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రి తావోయైసెచ్ లీయో వరద్కర్‌ను ఫోన్‌చేసి అభినందిస్తూ.. మధ్యలో ట్రంప్ ఈ విధంగా ప్రవర్తించడంతో బిత్తరపోవడం ఆమె వంతు అయింది. మంగళవారం ఓవల్ ఆఫీస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వరద్కర్‌కు అభినందనలు తెలిపేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ఐరీష్ మీడియా ప్రతినిధులు మనల్ని చూస్తున్నారు. వాళ్లు ఇప్పుడు గది నుంచి వెళుతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి రా.. అందమైన ఐరీష్ మీడియా ప్రతినిధులు’ అంటూ ట్రంప్ ఆర్‌టీఈ రిపోర్టర్ కైట్రియానా పెర్రీని చేతితో సైగ చేసి మరీ తన దగ్గరికి పిలిపించుకున్నారు. ఐరీష్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఆమెను ఉద్దేశించి ‘నీ నవ్వు బాగుంది’ అంటూ కితాబిచ్చారు. మొహమాటానికి ట్రంప్ దగ్గర నిలబడిన పెర్రీ అనంతరం ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందిస్తూ ట్రంప్ చర్య ‘వికృతంగా’ ఉందని మండిపడింది. అమెరికా నెటిజన్లు కూడా ఆమెకు మద్దతు పలికారు. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన వారు ట్రంప్ తరఫున ఆమెకు సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపారు.