పుతిన్‌తో చెడింది.. చైనాతో కుదిరింది! | Trump U Turns on china, russia, syria | Sakshi
Sakshi News home page

పుతిన్‌తో చెడింది.. చైనాతో కుదిరింది!

Published Sun, Apr 16 2017 3:50 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

పుతిన్‌తో చెడింది.. చైనాతో కుదిరింది! - Sakshi

పుతిన్‌తో చెడింది.. చైనాతో కుదిరింది!

- రష్యా, చైనా, సిరియాలపై ట్రంప్‌ పిల్లిమొగ్గలు
- సిరియా పాలకుడు బషర్‌కు మూడింది
- ఫెడ్‌ చైర్మన్‌ యెల్‌న్‌పై గౌరవం పెరిగింది
- ఎగ్జిమ్‌ బ్యాంకు మంచిదే అని తెలిసింది


(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికలకు ముందు వివిధ అంశాలపై ప్రకటించిన తన వైఖరులపై అధ్యక్షుడైన తర్వాత మాట మార్చారు. అధ్యక్షుడు కాకముందు.. నాటోకు కాలం చెల్లిందన్న ట్రంప్‌.. తాజా నాటోకు కాలం చెల్లలేదని ఉద్ఘాటించారు. కరెన్సీని చైనా మానిప్యులేట్‌ చేస్తోందని ఎన్నికలకు ముందు తీవ్రంగా ఆరోపించిన ట్రంప్‌.. తాజాగా చైనా అలా చేయడం లేదని చెప్పుకొచ్చారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి అనుబంధం ఉందని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో పుతిన్‌ను వెనుకేసుకొస్తూ కీర్తించిన డొనాల్డ్‌.. ఇప్పుడు ఆయనపై అనుమానాలు వ్యక్తంచేశారు. అమెరికా – రష్యా సంబంధాలు తీవ్రంగా దిగజారాయని మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానించారు. ఇటీవల నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ, అంతకుముందు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మారిన మాటలేమిటి.. అంతకుముందు ఆయన వైఖరులేమిటనేది క్లుప్తంగా...

నాటో...
నిన్నటి మాట:
అమెరికా పెద్దన్నగా ఉన్న సైనిక కూటమి నాటోకి కాలం చెల్లింది. దానివల్ల అమెరికాపై చాలా ఆర్థిక భారం పడుతోంది. అది ఉగ్రవాదం విషయంలో సరిగా స్పందించడం లేదు. ఉగ్రవాదంపై దృష్టి కేంద్రీకరించే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి.

నేటి తాజా పాట: నాటోకు కాలం చెల్లిందని నేను చాలా కాలం కిందట విమర్శించాను. నా వ్యాఖ్యల వల్ల వాళ్లు మారారు. ఇప్పుడు వాళ్లు ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నారు. నాటోకు కాలం చెల్లిందని నేనన్నాను. అదిక కాలం చెల్లిన సంస్థ కాదు.

చైనా...
నిన్న కరెన్నీ దొంగ..:
చైనా తన ఎగుమతులను పెంచుకునేందుకు కరెన్సీని వక్రీకరిస్తోంది. అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతోంది. మన దేశంపై అత్యాచారం చేయడాన్ని ఏమాత్రం అనుమతించకూడదు. నేను అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే.. చైనా మీద కరెన్సీ మానిప్యులేటర్‌గా ముద్ర వేస్తాను. భారీ టారిఫ్‌లు విధిస్తాను. కోర్టుకీడుస్తాను.

నేడు స్నేహ గీతం..: చైనా కరెన్సీ మానిప్యులేటర్‌ కాదు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో నేను మాట్లాడాను. మా మధ్య మంచి అనుబంధం కుదిరింది. ఉత్తర కొరియా విషయంలో చైనా మనకు సాయం చేయాలనుకుంటోందని నేను భావిస్తున్నా.

రష్యా..
నిన్నటి ఆప్త మిత్రుడు..:
రష్యాతో అమెరికా స్నేహ సంబంధాలు బలపడితే చాలా బాగుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నన్ను జీనియస్‌ అని కీర్తించారు. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదు. ఆంక్షల విషయంలో పుతిన్‌ తొందరపడకపోవడం ఆయన తెలవైన వాడని సూచిస్తోంది. పుతిన్‌తో స్నేహం అమెరికాకు లాభిస్తుంది.

నేడు దూరమయ్యాడు..: సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు రష్యా మద్దతు ఇస్తుండటం పట్ల నాకు ఆందోళన పెరుగుతోంది. 87 మందిని బలిగొన్న రసాయన దాడిలో రష్యా పాత్ర ఏమిటి? ఈ దాడి గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి ముందుగానే తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. రష్యాతో మన సంబంధాలు చాలా బలహీనపడ్డాయి.

సిరియా...
నిన్న అది రష్యా పని..: సిరియా వ్యవహారాన్ని రష్యా చూసుకోవాలి. ఐసిస్‌ను నియంత్రించే పని సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ చూసుకోవాలి. అసద్‌ ప్రభుత్వం కొనసాగాలి.

నేడు అది నాటో కృషి..: సిరియాలో కిరాతకమైన అంతర్యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. అసద్‌ ఒక నరహంతకుడు. సిరియాలో ఈ విపత్తును పరిష్కరించడానికి నాటో ఉమ్మడిగా కృషి చేయాలి.

జానెట్‌ యెలెన్‌...
నిన్న ఒబామా ఏజెంట్‌: ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జానెట్‌ యెలెన్‌.. బరాక్‌ ఒబామాకు రాజకీయంగా సాయం చేయడానికి వడ్డీ రేట్లను వక్రీకరిస్తున్నారు. ఈ చర్య వల్ల భారీ మాంద్యం ముంచెత్తవచ్చు.

నేడు గౌరవ చైర్మన్‌..: జానెట్‌ యెలెన్‌ పదవీ కాలం ముగిసిన తర్వాత కొనసాగిస్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ.. ఆమె అంటే నాకు ఇష్టం. ఆమెను నేను గౌరవిస్తున్నా.

ఎగ్జిమ్‌ బ్యాంక్‌...
నిన్న అవసరం లేదు..:
ఎగ్జిమ్‌ (ఎగుమతి – దిగుమతి) బ్యాంక్‌ అవసరం లేదు. అదంటే నాకు ఇష్టం లేదు. ఆ బ్యాంకు ప్రధానంగా కొన్ని సంస్థలకే సాయం చేస్తుంది. ఆ బ్యాంకు లేకపోయినా ఆ సంస్థలకు ఏ లోటూ ఉండదు.

నేడు మంచి బ్యాంకు..: ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు నేను మద్దతిస్తున్నా. ఆ సంస్థ చాలా చిన్న కంపెనీలకు కూడా సాయం చేసింది. అది చాలా మంచి పని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement