కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు: లక్ష్మణ్
- కాంగ్రెస్ నేతల చేరికలపై టీఎస్ బీజేపీ చీఫ్ వ్యాఖ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీపరులను, నమ్మకస్తులను కాషాయదళంలోకి చేర్చుకుంటామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్. అంతమాత్రాన బీజేపీలో చేరాల్సిందిగా ఎవరివెంటా పడబోమని, కాంగ్రెస్‌వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని స్పషం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
భవిష్యత్తులో అధికారంలోకి రాబోయే రాష్ట్రంగా తెలంగాణను మొదటి కేటగిరీలో చర్చామని, అందుకే అమిత్ షా 3 రోజులపాటు తెలంగాణలోనే పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాగా, బీజేపీ పార్టీ పదవుల్లో కొనసాగుతూ సరిగా పని చెయ్యని వారిపై సమీక్ష నిర్వహిస్తామని, గతంలో పోటీ చేసి యాక్టివ్‌గా ఉన్నవాళ్లపేర్లను మరలా పరిశీలిస్తామన్నారు. ఇంటింటికీ తిరిగి టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ చెప్పారు.