ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుతా
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే గుర్తు 'రెండాకులు' దక్కించుకునేందుకు ఎన్నికల అధికారికి భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యవర్తి సుఖేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన చెన్నై నుంచి ఢిల్లీకి వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో దినకరన్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుతానని చెప్పారు.
శనివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని బుధవారం అర్థరాత్రి దినకరన్కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఆయన అన్నాడీఎంకే శశికళ వర్గం తరఫున బరిలో నిలిచారు. కాగా ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేశారని ఐటీ దాడుల్లో వెలుగు చూడటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఎన్నికలను రద్దు చేస్తూ, ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. రెండాకుల గుర్తుకోసం ఎన్నికల అధికారికి రూ. 50 కోట్ల లంచం ఇవ్వజూపారని దినకరన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల మధ్య విలీన ప్రతిపాదనలు వచ్చాక అన్నాడీఎంకే నుంచి దినకరన్‌ను బహిష్కరించారు.