ఆర్కే నగర్ బరిలో ఎవరెవరు?
తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి జయలలిత మరణం తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె నెచ్చెలి శశికళ భావించారు. ఎటూ అమ్మ మీద అభిమానంతో చిన్నమ్మను గెలిపిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అనుకున్నారు. కానీ ఇంతలో సుప్రీంకోర్టు తీర్పు ఆమెకు అశనిపాతంలా మారడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు తన అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ను ఆర్కే నగర్ బరిలోకి దించాలని శశికళ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గురువారం ప్రకటించిన మంత్రివర్గంలో కూడా దినకరన్‌కు స్థానం ఉంటుందని చాలామంది భావించారు. అయితే, ఎమ్మెల్యే పదవి లేకుండా నేరుగా మంత్రిని చేస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో.. ముందుగా అతడిని ఆర్కే నగర్ బరిలో దించి, ఆ తర్వాత కీలకమైన మంత్రిత్వ శాఖ అప్పగించాలన్నది శశికళ ఆలోచన అని అంటున్నారు. అయితే, ఇప్పటికే శశికళ మీద కొంత వ్యతిరేకత ఉన్న ఆర్కే నగర్ వాసులు.. ఆమె అక్క కొడుకు, పలు ఆర్థికపరమైన ఆరోపణలు ఉన్న దినకరన్‌ను ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా అనుమానంగానే ఉంది.
మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం కూడా ఆర్కేనగర్ స్థానం మీద గట్టిగా దృష్టిపెట్టింది. తాము ఎంతగా అనుకున్నా ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం ఒక ఎత్తయితే శశికళ వర్గీయులకు ఆ పదవి దక్కడాన్ని పన్నీర్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ ఆశయాల సాధనే తన లక్ష్యమని ప్రకటించిన ఆయన.. ముమ్మూర్తులా జయలలితలాగే కనిపించే దీపా జయకుమార్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీపకు ఎటూ శశికళ పోలికలు ఉండటం, ఆర్కే నగర్ వాసులు తాము అమ్మ కోసమే ఉన్నామని ఇంతకుముందు సైతం చెప్పడంతో ఆమెను పోటీకి దింపితే గెలవడం ఖాయమన్న అంచనాలు పన్నీర్ వర్గానికి ఉన్నాయి. దీపను ముందుకు పెట్టడం ద్వారా మళ్లీ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా పొందగలిగితే, పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం కూడా పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వాన్ని కూల్చే విషయం వరకు వస్తే డీఎంకే సైతం మద్దతిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. ముందుగా ఆర్కే నగర్ స్థానం మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు.
మరో నాలుగు నెలలే
ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆరు నెలల్లోగా మళ్లీ ఎన్నిక నిర్వహించాలి. జయలలిత డిసెంబర్ 5వ తేదీన మరణించారు. దాంతో జూన్ లోగా ఎన్నిక నిర్వహించి, కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాలి. ఇప్పటికే రెండు నెలల సమయం ముగియడంతో మరో నాలుగు నెలల్లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎవరికి వాళ్లు పావులు కదుపుతున్నారు.