ట్విట్టర్‌లో ‘కట్ అండ్ పేస్ట్’గాళ్ల భరతం!
న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో కేకుల్లా కటవుతున్న జోకులను చూసి కడుపుబ్బ నవ్వుతున్న వాళ్లు, వాటిని తిరిగి ఇతరులకు షేర్ చేస్తున్న వాళ్లు నేడు కోకొల్లలు. ఆ జోకులు పేల్చింది ఎవరో, వారి పేరు కూడా కనీసం ప్రస్తావించకుండా, వాటిని తామే సృష్టించామనే భ్రమ కలిగేలా ఫోజులిచ్చేవాళ్లూ కోకొల్లలే. జోకుల కాపీరైట్ గలవారి గోలను తట్టుకోలేక చివరకు ‘ట్విట్టర్’ చర్యలకు ఉపక్రమించింది. కట్ అండ్ పేస్ట్‌గాళ్ల భరతం పట్టేందుకు సిద్ధమైంది.
కాపీరైటర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే బోలెడు జోకుల్ని ‘విత్ హెల్డ్’ పేరిట బ్లాక్ చేసింది. దాంతో కాపీరైటర్లు, కమేడియన్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్న ఓల్గా లెక్సెల్ సీరియస్‌గా ఇచ్చిన ఫిర్యాదుతో ట్టిట్టర్ యాజమాన్యంలో కదలిక వచ్చింది. తర్వాత మరెంతో మంది కాపీరైటర్లు ఆమె లాగానే ఫిర్యాదులు చేశారు. కాపీరైటర్లు మరింత ముందుకు వచ్చి ట్విట్టర్‌లో వచ్చిన తమ జోకుల గురించి ఫిర్యాదు చేయాలని, ఆ జోకులు తమవేనంటూ నిరూపించే డాక్యుమెంట్లుగానీ, వీడియో క్లిప్పింగులుగానీ ఫిర్యాదుతోపాటు పేర్కొనాలని ట్విట్టర్ యాజమాన్యం సూచించింది.
ప్రస్తుతం కాపీరైట్‌గల జోకులను ఇతరులెవరైనా కట్ అండ్ పేస్ట్ చేస్తే వాటిని ప్రస్తుతానికి ‘వితెల్డ్’ చేస్తున్నామని, ఈ ట్రెండ్‌ను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో కట్ అండ్ పేస్ట్‌గాళ్ల భరతం పట్టేందుకు కాపీరైట్ చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటామని ట్టిట్టర్ యాజమాన్యం హెచ్చరించింది.