
కీర్తి(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ తండ్రి కూతురినే కడతేర్చిన ఉదంతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన పత్తివాడ సురేశ్–జ్యోతి మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ పాప పుట్టిన తర్వాత దంపతుల మధ్య గొడవలు జరగడంతో జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. తాగుడు మానేస్తానని భార్యా బిడ్డలను బాగా చూసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో సురేశ్ అంగీకరించాడు. రెండున్నరేళ్ల వయసు గల కుమార్తె కీర్తి, భార్యను నెలరోజుల క్రితం నగరానికి తీసుకువచ్చాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లోని ఓ ఇంట్లో వాచ్‌మన్‌గా చేరాడు. మొదటి నుంచి భార్యపై అనుమానం పెట్టుకున్న సురేశ్ తరచూ గొడవలు పడేవాడు.
ఈ క్రమంలో శనివారంరాత్రి మద్యం మత్తులో ఉన్న సురేశ్ మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో కీర్తి ఏడవడంతో ఆమెను ఇంటి బయట ఉన్న గార్డెన్‌లోకి తీసుకుపోయాడు. సురేశ్ విచక్షణారహితంగా కుమార్తె ఛాతీ, మొహంపైన కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆదివారం ఉదయం జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
కిరోసిన్‌తో ఆడుకుంటూ చిన్నారి మృతి
హైదరాబాద్: కిరోసిన్ డబ్బాతో ఆడుకుంటుండగా కిరోసిన్ ఒంటిపై పడింది. పాపం.. ఆ చిన్నారికేం తెలుసు.. తెలియక పక్కనే ఉన్న అగ్గిపెట్టెను వెలిగించింది. అంతే.. ఆ చిన్నారి మంటలకు ఆహుతైంది. ఈ ఘటన రాజధాని యాకుత్‌పురాలో జరిగింది. వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కి చెందిన మహ్మద్ హజీ, హజ్రా ఉన్నిసా దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా, శనివారం యాకుత్‌పురాలోని ఉన్నిసా సోదరుడు మహ్మద్ వాజిద్ ఖురేషి ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లారు.
సాయంత్రం సమయంలో ఉన్నిసా చిన్న కుమార్తె ఆఫ్సాఉన్నిసా(3) మేడపైకి వెళ్లింది. అక్కడ వంట చేసుకొనేందుకు ఉంచిన కిరోసిన్ డబ్బాతో ఆడుకుంటుండగా అందులోని కిరోసిన్ చిన్నారిపై పడింది. పక్కనే ఉన్న అగ్గి పెట్టె్టను తీసి వెలిగించడంతో చిన్నారికి మంటలం టుకున్నాయి. దీంతో పెద్దగా కేకలు పెట్టడంతో అంతా మేడపైకి పరుగెత్తారు. మంటలార్పి గాయాలతో ఉన్న ఆఫ్సాను వెంటనే ఉస్మాని యా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.