ఫార్చునర్ బోల్తా: ఇద్దరి మృతి
* టైర్ పగలడంతో అదుపుతప్పిన కారు
* అతివేగంతోనే ప్రమాదం!
* దర్గాకు వెళ్లి వస్తుండగా ఘటన
* మృతులు నగరవాసులు
* క్షతగాత్రులను పరామర్శించిన చార్మినార్ ఎమ్మెల్యే
పూడూరు: వేగంగా వెళ్తున్న ఫార్చునర్ కారు టైర్ పగలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హైదరాబాద్ పాతబస్తీవాసులు. దర్గాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది కర్ణాటక రాష్ట్రం చించోలిలో ఉన్న దర్గాలో జల్సా ఉత్సవాలకు ఫార్చునర్ కారు(ఏపీ 09 బీజడ్ 0440)లో వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున పూడూరు మండలం కేశవరెడ్డి పాఠశాల సమీపంలో రహదారిలో మలుపులో కారు ముందు టైర్ పగిలిపోయింది. వాహనం వేగంగా ఉండడంతో రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న సయ్యద్ అలీమొహియుద్దీన్(32), సయ్యద్ ఫహీమొద్దీన్(30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వలీ పాషా(32) పరిస్థితి విషమంగా ఉంది. నహీముల్లా, పిరాసత్ ఉల్లా, హజీజ్, అజారుద్ధీన్, బురాన్‌పాషా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు.
వికారాబాద్ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతుల బంధువు హైమద్ ఉల్‌ఉస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.
మలుపులో మాటేసిన మృత్యువు
ఫార్చునర్ కారు అతివేగంగా ఉండడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనం వేగంగా ఉండడంతో డ్రైవర్ రహదారిపై ఉన్న మలుపును గమనించలేదు. మలుపు వద్దకు రాగానే గుర్తించి ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఫార్చునర్ కారు ముందు టైరు పగిలిపోయింది. దీంతో వాహనం పల్టీలు కొడుతూ దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడిపోయింది. వాహనం వేగంగా ఉండడం, పల్టీలు కొట్టడంతో ఫార్చునర్ వాహనం నుజ్జనుజ్జయింది.
సంఘటన బాధాకారం...
దర్గాకు వెళ్లి వస్తున్న వారు ప్రమాదానికి గురికావడంతో బాధాకరమని చార్‌మినార్ ఎమ్మెల్యే సయ్యద్ పాషా ఖాద్రీ పేర్కొన్నారు. క్షతగాత్రులు, మృతులు చార్మినార్ ప్రాంతవాసులు కావడంతో విషయం తెలుసుకున్న ఆయన వికారాబాద్ వచ్చారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.