పనిచేయడం లేదని.. ఐపీఎస్‌లను పీకిపారేశారు!
పనిచేయడం లేదని.. ఐపీఎస్‌లను పీకిపారేశారు!
Published Wed, Jan 18 2017 8:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:51 PM
ప్రభుత్వోద్యోగం వచ్చిందంటే చాలు.. హాయిగా కాలం గడిపేయొచ్చని, రిటైరైన తర్వాత కూడా ఎంచక్కా పింఛను తీసుకోవచ్చని, పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదని అనుకునే రోజులకు ఇక కాలం చెల్లింది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఇలాంటి వాళ్లను లొంగదీస్తున్నారు. ఇప్పటికి 60 మంది అధికారులను డిస్మిస్ చేయడం, తప్పనిసరిగా రిటైర్ చేయడం లాంటి చర్యలు జరిగాయి. తాజాగా ఆ జాబితాలోకి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా చేరారు. 1992 బ్యాచ్‌కి చెందిన ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజ్‌కుమార్ దేవన్‌గణ్, 1998 బ్యాచ్‌కి చెందిన అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరాం కేడర్ ఆఫీసర్ షీల్ చౌహాన్ ఇద్దరినీ ముందుగానే రిటైర్ చేయించి ఇంటికి పంపేశారు. ప్రభుత్వ సర్వీసులో చేరి 15-25 ఏళ్ల వరకు పూర్తిచేసుకున్నవాళ్ల పనితీరును సమీక్షించిన తర్వాత ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనితీరు ఒక మాదిరి కంటే తక్కువగా ఉంటే మాత్రం కఠిన చర్యలు తప్పడం లేదు.
ఈ ఇద్దరు అధికారుల మీద ఇప్పటికే ఫిర్యాదులు కూడా ఉన్నాయని, అందుకే వాళ్లకు మూడు నెలల జీతం ఇచ్చి తప్పనిసరి ముందస్తు రిటైర్‌మెంట్ ఇచ్చారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వాధికారులకు సంబంధించి ఇలాంటి నిబంధన ఎప్పటినుంచో ఉంది. కానీ, దీన్ని ఎవరూ సరిగా అమలుచేయలేదు. అసమర్థులు, అవినీతిపరులైన అధికారులు 'ప్రజాప్రయోజనాల రీత్యా తప్పనిసరిగా రిటైర్ కావాలి' అని ఈ నిబంధన చెబుతోంది. 2015 సంవత్సరంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దీన్ని వెలికితీసి, 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల పనితీరు తప్పనిసరిగా పరిశీలించాలని, పనిచేయని వాళ్లకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో తెల్ల ఏనుగుల్లా పనిచేయకుండా కూర్చుంటున్న వాళ్లను ఇంటికి పంపడానికి బీజేపీ ప్రభుత్వం ఈ నిబంధనను బాగానే ఉపయోగించుకుంటోందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
Advertisement