
భారత ఆర్మీ స్థావరం వద్ద తీవ్ర కలకలం!
అనుమానాస్పద బ్యాగులు లభించడంతో హై అలర్ట్
పఠాన్ కోట్ ఆర్మీ స్థావరానికి కొన్ని అడుగుల దూరంలోనే రెండు అనుమానాస్పద బ్యాగులు దొరకడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం పఠాన్ కోట్ లోని మమూన్ కంటోన్మెంట్ కు సమీపంలో రెండు అనుమానాస్పద బ్యాగులు దొరికాయి. వాటిని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ నిపుణులు ఆ బ్యాగులను తెరిచి చూడగా.. అందులో అనుమానాస్పదరీతిలో రెండు మొబైల్ టవర్ బ్యాటరీలు దొరికాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించారు. గత మంగళవారం ఓ స్కార్పియో వాహనం బారికేడ్లను ఢీకొట్టి.. పోలీసులను తప్పించుకొని పోయింది. అనంతరం ఆ వాహనాన్ని గురుదాస్ పూర్ జిల్లాలో వదిలేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న ఆ వాహనంలో ఐదారుగురు అనుమానిత వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారని గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.