గౌహతి: ఉల్ఫా తీవ్రవాదుల చెరలో ఉన్న బాలుడ్ని రక్షించినట్లు అసోంలోని గోయిల్పరా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు మరణించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... అసోంలోని గోయిల్పరా జిల్లాలో ఇటీవల కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా బెల్దాంగ్ పారా కృష్ణయ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి ఎదురు కాల్పులకు దిగారు. ఆ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. ఆ కాల్పులలో పోలీసు బృందంలో బెటాలియన్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారని... అతడిని గౌహతి మెడికల్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాలుడ్ని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఉల్ఫా తీవ్రవాది హితేశ్వర్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు.