Goalpara
-
బస్సు లోయలో పడి ఆరుగురు మృతి
గువాహటి : అసోంలో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గోల్పారా జిల్లాలోని రాంగ్‌జూలీ సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దుబ్రి నుంచి గువాహటి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. -
భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
గోల్పారా: మేఘాలయలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో గోల్పారా జిల్లాలోని ఓ గ్రామంలో ఇవి పోలీసుల కంటపడ్డాయి. ఇటీవల పోలీసులకు పట్టుబడిన ఉల్ఫా కేడర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు చెప్పిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఇవి లభించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం 52 జిలెటిన్స్, 182 డిటోనేటర్స్, కొన్ని మీటర్ల ఫ్యూజ్ వైరు లభించింది. ఇటీవల ఉల్ఫాకు చెందిన లాంబు అసోం, హరినాథ్ రభా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా ఈ బాంబుల వివరాలు తెలిశాయి. -
తీవ్రవాదులను చంపి ... బాలుడ్ని రక్షించిన పోలీసులు
గౌహతి: ఉల్ఫా తీవ్రవాదుల చెరలో ఉన్న బాలుడ్ని రక్షించినట్లు అసోంలోని గోయిల్పరా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు మరణించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... అసోంలోని గోయిల్పరా జిల్లాలో ఇటీవల కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా బెల్దాంగ్ పారా కృష్ణయ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి ఎదురు కాల్పులకు దిగారు. ఆ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. ఆ కాల్పులలో పోలీసు బృందంలో బెటాలియన్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారని... అతడిని గౌహతి మెడికల్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాలుడ్ని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఉల్ఫా తీవ్రవాది హితేశ్వర్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. -
అసోంలో బాంబు పేలుడు, ఒకరి మృతి
-
అసోంలో బాంబు పేలుడు, ఒకరి మృతి
అసోం: అసోం గోల్పారా జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను గోల్పారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కృషినీ పోలీసు స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం 8.10 నిమిషాలకు ఈ పేలుడు సంభవించింది. తీవ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాన్ని ఓ సైకిల్‌కు అమర్చినట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని ముజిబార్ రెహ్మాన్గా పోలీసులు గుర్తించారు. -
ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు
అక్కడ ఓటెయ్యాలంటే పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిందే. అక్కడి పరిస్థితి అలాంటిది. మేఘాలయ లోని నార్త్ గారో హిల్స్ నియోజకవర్గంలో పదకొండు పోలింగ్ బూత్ లకు వెళ్లాంటే ఓటర్లు అస్సాం రాష్ట్రంలోకి రావాలి. అక్కడనుంచి మళ్లీ మేఘాలయ లోకి వెళ్లాలి. అప్పుడు ఓటేయాలి. అందుకే ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు ప్రయాణించాలి. సమస్యేమింటంటే ఈ గ్రామాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలున్నాయి. చాలా హింస కూడా జరిగింది. అందుకే ఈ పోలింగ్ బూత్ ల ఏర్పాట్లు చేయాలంటే అస్సాం లోని గోల్పారా జిల్లా అధికారుల కలిసి మేఘాలయ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయాలి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఇంతా చేసి మొత్తం ఓటర్ల సంఖ్య వంద కూడా ఉండదు. -
అసోంలో మిలిటెంట్ల దాడి, ఏడుగురు మృతి
గోల్పారా: దీపావళి సందర్భంగా తీవ్రవాదులు తెగబడ్డారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సామాన్యులపై రెచ్చిపోయారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చి టీ షాపు ముందు సేద దీరుతున్న గిరిజనులపై కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యేక మేఘాలయ కోసం పోరాడుతున్న "గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ "కి చెందిన తీవ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. స్థానిక కౌన్సిల్ ఎన్నికల పై ఏర్పడిన వివాదం కారణంగానే ఈ ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అధునాతన ఆయుధాలతో వారు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న రబా హజోంగ్ గిరిజనులు, ఎన్నికలకు అనుకూలంగా ఉన్న ఇతర వర్గాల మధ్య అక్టోబర్ నుంచి అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 13, 25వ తేదీల్లో జరగనున్నాయి. జిల్లాలో రబా హజోంగ్ ఆధిపత్యం ఉంది. తమకు తాము పాలించుకునేందుకు స్వయం ప్రతిపత్తి కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.