గోల్పారా: దీపావళి సందర్భంగా తీవ్రవాదులు తెగబడ్డారు. అస్సాంలోని గోల్‌పారా జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సామాన్యులపై రెచ్చిపోయారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చి టీ షాపు ముందు సేద దీరుతున్న గిరిజనులపై కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యేక మేఘాలయ కోసం పోరాడుతున్న "గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ "కి చెందిన తీవ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. స్థానిక కౌన్సిల్ ఎన్నికల పై ఏర్పడిన వివాదం కారణంగానే ఈ ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
అధునాతన ఆయుధాలతో వారు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న రబా హజోంగ్ గిరిజనులు, ఎన్నికలకు అనుకూలంగా ఉన్న ఇతర వర్గాల మధ్య అక్టోబర్ నుంచి అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 13, 25వ తేదీల్లో జరగనున్నాయి. జిల్లాలో రబా హజోంగ్ ఆధిపత్యం ఉంది. తమకు తాము పాలించుకునేందుకు స్వయం ప్రతిపత్తి కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అసోంలో మిలిటెంట్ల దాడి, ఏడుగురు మృతి
Published Mon, Nov 4 2013 8:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement