
టీఆర్‌ఎస్‌లో ఎన్నికల గుబులు!
రానున్న ఐదారు నెలల్లో వరంగల్ ఉప ఎన్నిక, మండలి, ‘గ్రేటర్’ పోరు
ఇటీవలి ఓటముల నేపథ్యంలో గులాబీ శిబిరంలో ఆందోళన
అధికార పార్టీ ఏడాది పాలనకు రెఫరెండమే?
ఉనికి చాటుకునేందుకు విపక్ష పార్టీలూ సిద్ధం
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమ కాలంలో ఎన్నికల వ్యూహాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకున్న టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఆ ఎన్నికలే వణుకు పుట్టిస్తున్నాయి! ఉద్యమం వెనకబడుతోందని భావించినప్పుడల్లా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల పేరిట తిరిగి వేడి రాజేయడాన్ని ఆనవాయితీగా పాటిస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోపాటు టీఆర్‌ఎస్ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో ఐదు నెలల్లో జరగనున్న ఎన్నికలు అధికార పార్టీకి కఠిన పరీక్ష పెట్టనున్నాయి. ముఖ్యంగా మండలి పట్టభద్రుల ఎన్నికలతోపాటు ఆయా జిల్లాల్లో జరిగిన ఎంపీటీసీ, సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చేదు ఫలితాలు రావడం, పార్టీలోని ఆయా వర్గాల్లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటం వంటి పరిణామాలు గులాబీ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
‘మండలి’ సమరం...
శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నా దక్షిణ తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలం పెరిగినట్లు టీఆర్‌ఎస్ భావిస్తోంది. కానీ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం మొదలైంది. ఖమ్మం వంటి జిల్లాల్లో ఈ పోటీ మరింత ఎక్కువ కానుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రాబల్యం అధికంగా ఉంది. దీంతో ‘స్థానిక’ మండలిలో అధికార టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమంటున్నారు.
వరంగల్‌లో హోరాహోరీ!
డిప్యూటీ సీఎంగా మంత్రివర్గంలో చేరడం వల్ల కడియం శ్రీహరి ఇటీవల వరంగల్ (ఎస్సీ స్థానం) ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానాన్ని చేజిక్కించుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు దృష్టిసారించాయి. కాంగ్రెస్ ఏకంగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం ఈ ఎన్నిక ను ఆషామాషీగా తీసుకోద్దని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ ఉప ఎన్నిక రూపంలో సీఎం కే సీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.