జనరల్‌ బడ్జెట్‌లో తానొవ్వక, నొప్పించక.. | union budget 2017 review | Sakshi
Sakshi News home page

జనరల్‌ బడ్జెట్‌లో తానొవ్వక, నొప్పించక..

Published Wed, Feb 1 2017 5:44 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

జనరల్‌ బడ్జెట్‌లో తానొవ్వక, నొప్పించక.. - Sakshi

జనరల్‌ బడ్జెట్‌లో తానొవ్వక, నొప్పించక..

న్యూఢిల్లీ: ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అన్న చందంగా ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్‌. ఏ రంగానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ రంగాన్ని పూర్తిగా విస్మరించకుండా, ఏ రంగంపైనా అధిక పన్నుల భారం మోపకుండా. అన్ని రంగాలకు అంతో ఇంతో అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చారు అరుణ్‌ జైట్లీ.

పెద్ద నోట్ల రద్దుతో పోయిన నరేంద్ర మోదీ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు, మరో పక్క ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని  ఈసారి బడ్జెట్‌లో భారీ రాయితీలు ఉంటాయని అన్ని వర్గాల ప్రజలు భావించారు. మధ్యతరగతివారు ముఖ్యంగా వేతన జీవులు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదులక్షల రూపాయల వరకు పెంచుతారని ఆశించారు. అయితే అరుణ్‌ జైట్లీ పరిమితిని పెంచకుండా ఈ స్లాబ్‌లో ఉండే పది శాతం ఆదాయం పన్నును ఐదు శాతానికి తగ్గించి కొంత ఊరట కల్పించారు. ఆ మేరకు పడే ఆర్థిక భారాన్ని 50 లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదించేవారిపై పది శాతం సర్‌చార్జి విధించడం ద్వారా భర్తీ చేసుకున్నారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యూపీఏ ప్రభుత్వం శిలాఫలకంగా చరిత్రలో మిగిలిపోతుందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించినప్పటికీ ఆ పథకానికే ఆర్థిక మంత్రి మున్నెన్నడు లేనివిధంగా 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఊతమిస్తున్నామని చెప్పిన జైట్లీ ఉపాధి హామీకి ఇన్ని రేట్లు కేటాయించిన కారణంగా తమకు వ్యవసాయ కూలీలు దొరక్క నష్టపోతామని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో మౌలిక సౌకర్యాలకు కాస్త కేటాయింపులు పెంచడం కార్పొరేట్‌ రంగానికి ఊతమివ్వడానికే. ఆ మేరకు కార్లపై మౌలిక సౌకర్యాల సెస్‌ను విధించడం వల్ల రాబడుతోంది.

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, అవినీతిపై ఆయుధమని ప్రశంసించినా అరుణ్‌ జైట్లీ పెద్ద నోట్ల రద్దు ఫలితాలేమిటో వివరించలేక పోయారు. అవినీతిపై పోరులో భాగంగా మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావా దేవీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకే ఈ చర్య తీసుకున్నారు. రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలలో నల్లడబ్బును అరికట్టేందుకు 20 వేల లోపు విరాళాలకు దాతల పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదన్న పరిమితిని రెండువేల రూపాయలకు కుదించినట్లు వెల్లడించారు. 20 వేల నిబంధన ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీల్లోకి  నల్ల డబ్బు ప్రవాహాన్ని  అరికట్టలేని ప్రభుత్వాలు ఇప్పుడు అరికడతాయనుకుంటే అత్యాశే అవుతోంది. ఓటర్ల జాబితాల్లో ఉన్న పేర్లు, చిరునామాలనుబట్టి విరాళాల దాతల పేర్లు రాసుకునే రాజకీయ పార్టీలు తమ రంగును మార్చుకుంటాయా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలతో భారత ఐటీ కంపెనీలు కుదేలవుతున్న పరిస్థితుల్లో వాటిని ఆదుకునేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం శోచనీయం.

ఎప్పటిలాగే ఈసారి కూడా బడ్జెట్‌లో ప్రాథమిక విద్యారంగానికి ప్రభుత్వం అన్యాయమే చేసింది. ఉన్నత విద్యారంగానికి అంతో ఇంతో ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరిస్తూనే ఉంది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే ఎదురులేని యువ శక్తిగా భారత్‌ ఎదుగుతోందని భారత్‌ అంచనావేస్తోంది. ఆ యువతే ఇప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తోంది. ప్రాథమిక విద్యలో చేరిన విద్యార్థుల్లో 20 శాతం మంది విద్యార్థులు మాధ్యమిక విద్యలోకి, వారిలో 34 శాతం మంది ఉన్నత విద్యలో ప్రవేశించడం లేదు. సరైన సౌకర్యాలు, ప్రోత్సాహం లేకపోవడమే అందుకు కారణం.

ద్రవ్యోల్బణాన్ని మూడుశాతానికి మించకుండా చూస్తానని సవాల్‌ చేసిన అరుణ్‌ జైట్లీ ఈ బడ్జెట్‌లో దాన్ని 3.2గా సవరించుకున్నారు. వచ్చే ఏడాది మాత్రం మూడు శాతానికి మించికుండా చూస్తానని హామీ ఇచ్చారు. స్థూల జాతీయ వద్ధి రేటును రెండేళ్లలో 8 నుంచి 10 శాతానికి తీసుకెళతామని తొలి బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం వద్ధి రేటు అంచనాలను కూడా ఏడు శాతానికి తీసుకెళ్లే స్థితిలో లేదు. పెద్ద నోట్ల రద్దుతో వచ్చే ఏడాది వద్ధి రేటు ఎంత తగ్గుతుందో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఆర్థిక వనరులను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సర్ది చూపించారు.
 

(సంబంధిత వార్తలు..)

గృహ రంగానికి గుడ్న్యూస్

పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!


బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..


ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు


ఆదాయపన్ను రేట్లు ఇలా..


తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ

మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement