
'తెలంగాణ'.. ఢిల్లీలో క్లైమాక్స్ సీన్
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెండూ వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర విభజన అంశం దాదాపుగా క్లైమాక్స్ కు చేరింది. ఢిల్లీలో ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. ఇక కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సాయంత్రం 5:30 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి అవుతుంది.
కేబినెట్ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కావూరి సాంబశివరావు, పల్లంరాజు, జైపాల్ రెడ్డి హాజరయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదను జీవోఎం తోసిపుచ్చింది. అలాగే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనను పక్కనబెట్టింది. కాగా పొలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపేలా ప్రతిపాదించింది. ఇదిలావుండగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు వీలుగా కాంగ్రెస్ బీజేపీ మద్దతు కోరుతోంది. బీజేపీ నేత వెంకయ్య నాయుడుతో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ రహస్యంగా మంతనాలు జరిపారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరిస్తే మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత తెలిపింది. బీజేపీ మద్దతు ఇస్తే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మార్గం సుగుమమైనట్టే.