ఏపీని అనాథ రాష్ట్రంలా మార్చారు: వాసిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ని అనాథ రాష్ట్రంగా మార్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్ది పద్మ మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బదులు ఓ సామాన్యుడు ఆ కుర్చీలో ఉన్నా రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రాజెక్టుల నిర్మాణంపై అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉందన్నారు. ఇటు చంద్రబాబును చూస్తే.. నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిం చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
28న భేటీ: ఆంధ్రప్రదేశ్ వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఈ నెల 28న అనంతపురంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం స్కూలులో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. ఓబుళపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.