గత 12 ఏళ్లలో తొలిసారిగా...
కాలిఫోర్నియా వర్సిటికీ తగ్గిన విదేశీ దరఖాస్తులు
శాన్‌ఫ్రాన్సిస్కో: గత 12 ఏళ్లలో తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అంతకుముందు దాదాపు దశాబ్దకాలం పాటు ఈ యూనివర్సిటీకి వచ్చే విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్యలో ప్రతి ఏడాది సగటున 21 శాతం వృద్ధి నమోదయ్యేది.
ఈ విశ్వవిద్యాలయంలో 2017లో కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబరుతో ముగిసింది. ఆ నెలలోనే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలిసిందే. అత్యధికంగా మెక్సికో నుంచి వచ్చే దరఖాస్తుల్లో 30 శాతం తగ్గిపోగా, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే దేశాల నుంచి ఈసారి 10 శాతం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.